బ్రాహ్మణుల దీవెనలు వద్దనుకుంటున్నారా...?

Update: 2022-04-12 03:30 GMT
దేవుడు మంత్రానికి ఆధీనం. ఆ మంత్రం పూజారి  ఆధీనం. అలాంటి మంత్ర మహిమ బ్రాహ్మణులది. ఆధునిక కాలంలో వారు వివిధ వృత్తులలో స్థిరపడినా రాజకీయంగా అంతగా రాణించలేకపోయినా బ్రాహ్మణులు అంటే ఈ రోజుకీ సమాజంలో విలువ గౌరవం ఉన్నాయి. బ్రాహ్మణుల విషయంలో ఎవరూ ఉపకారం చేయకపోయినా వారిని దూరం చేసుకునే ప్రయత్నం అయితే చేయరు.

అంతవరకూ ఎందుకు టీడీపీ అధినేత చంద్రబాబు బ్రాహ్మణులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రెండున్నర దశాబ్దాలు అవుతోంది. చివరి సారిగా 1999 ఎన్నికల్లో తెలంగాణా మెదక్ జిల్లాకు చెందిన కరణం రామచంద్రరావుకు టికెట్ ఇచ్చి మంత్రిగా చేశారు. ఆయన మరణం తరువాత మళ్ళీ బ్రాహ్మణులకు పెద్దగా టీడీపీలో ప్రాధాన్యత లేదు. అయినా సరే బ్రాహ్మణులు అంతా టీడీపీనే ఎక్కువగా ఇష్టపడతారు.

దానికి కారణం చంద్రబాబు ఆ సామాజికవర్గం పట్ల బాగా ఉంటారు. రాజకీయం వేరు కానీ వారితో వ్యవహరించే తీరు కూడా వేరు. మీకు పదవులు ఇస్తాను, కానీ మీరు ఓట్ బ్యాంక్ పటిష్టం చేసుకోండి అని బాబు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అంతో ఇంతో బ్రాహ్మణ వ్యతిరేకత ఉంటే కనుక దాన్ని విభజన ఏపీలో చంద్రబాబు రూపుమాపుకున్నారు. ఏపీలో బ్రాహ్మణ కార్పోరేషన్ ని ఏర్పాటు చేసి వారి మనసు చూరగొన్నారు.

ఇక జగన్ విషయానికి వస్తే ఆయనకు బ్రాహ్మణుల పట్ల ద్వేషం అన్నది ఉంది అని ఎవరూ అనుకోరు. కానీ ఆయన వ్యవహార శైలి వల్లనే ఎందుకో ఆ వర్గం దూరం అవుతోంది. జగన్ నలుగురు బ్రాహ్మణులకు టికెట్ ఇస్తే అందులో మల్లాది విష్ణు, కోన రఘుపతి గెలిచారు. అందులో రఘుపతికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. ఇపుడు మల్లాది విష్ణుకు మంత్రి పదవి ఇస్తారు అనుకుంటే పూర్తిగా లేదనిపించేశారు. మొత్తానికి చూస్తే జగన్ క్యాబినెట్ లో ఒక్క బ్రాహ్మణ మంత్రి తొలి విడతలోనూ లేరు, మలి విడతలోనూలేరు.

ఇది నిజంగా బ్రాహ్మణ జాతికి అవమానమని భావిస్తే ఆ తప్పు ఎవరిది అని చూడాలి. ఇక బ్రాహ్మణ అధికారుల విషయంలో కూడా జగన్ తన రూల్ తనదే అన్నట్లుగా వ్యవహరించడంతో ఆయన అంటే అభిమానించే వారు కూడా దూరం అయ్యారు. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జగనే సాగనంపారని చెబుతారు.

ఇక డాలర్ శేషాద్రి నుంచి చూస్తే ఐవీఆర్ క్రిష్ణారావు వంటి వారు జగన్ కి విపక్షంలో ఉన్నపుడు మద్దతుగా నిలిచారు. ఐవీయార్ అయితే విశాఖలో జరిగిన  బ్రాహ్మణ సమావేశాలకు జగన్ని స్వయంగా  ఆహ్వానించి మంచి చేయమని కోరారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ కార్పోరేషన్ అన్నది పెద్దగా ఫంక్షనింగ్ లేకుండా పోయింది.

అక్కడ మొదట బ్రాహ్మణ సామాజికవర్గం జగన్ సర్కార్ మీద గుస్సా అయ్యారు. ఆ తరువాత రాజకీయంగా ప్రాధాన్యత లేకపోవడంతో పాటు సంక్షేమ పధకాల విషయంలో కూడా బ్రాహ్మణులకు ఏమీ పెద్దగా లబ్ది కలిగింది లేదు. దాంతో ఈ సామాజికవర్గం అయితే యాంటీ అవుతున్నారు. దానికి తోడు దేవాలయాల మీద జగన్ సర్కార్ లో జరిగిన దాడులు బ్రాహ్మణుల మనసు విరిచేశాయని చెబుతారు. మరి వారిని దారిని తెచ్చుకునే ప్రయత్నం చేయకుండా అసలు మంత్రీ కూడా చివరి రెండేళ్లూ ఇవ్వకపోవడం ద్వారా జగన్ ఈ సామాజికవర్గం వద్దు అనుకుంటున్నారా అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది.

ఇదిలా ఉంటే ఏపీలో అయిదు కోట్ల మంది జనాభాలో నాలుగైదు శాతం బ్రాహ్మణులు ఉన్నారు.  కానీ  వారి అన్ని జిల్లాల్లో  ఉన్నారు. వారి జనాభా ఎంత  అంటే   కచ్చితంగా పాతిక ముప్పయి  లక్షల దాకా ఉంటుంది. ఇక్కడ వీరి ఓట్లు పెద్దగా కలసి రాకపోవచ్చు. కానీ వారి మాట మౌత్ పబ్లిసిటీ మాత్రం ఏ పార్టీకైనా బాగా ఉపయోగపడుతుంది. మేధావి వర్గానికి చెందిన వీరిని దగ్గరకు తీసుకోకపోవడం ద్వారా జగన్ తప్పు చేస్తున్నారు అన్న వాళ్ళూ ఉన్నారు.

ఇక బ్రాహ్మణ మేధావి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు ఇటీవల జగన్ మీద  వ్యతిరేకంగానే విమర్శలు చేస్తున్నారు. ఐవీయార్ క్రిష్ణారావు బీజేపీలో ఉంటూ జగన్ పాలనను ఎండగడుతున్నారు. మొత్తానికి అయిదేళ్ల జగన్ పాలనను రావాలని, కావాలని దీవించిన విశాఖ శారదాపీఠాధిపతి రాజశ్యామల హోమాన్ని నిర్వహించారు. ఎంత కాదనుకున్నా ఆ మహిమా మహత్తు కూడా జగన్ కి కలసివచ్చిందనే చెప్పాలి. మరి అన్ని విధాలుగా బ్రాహ్మణులు నాడు జగన్ వెంట నడిస్తే రెండు విడతల మంత్రి వర్గంలో ఒక్క మంత్రి అది కూడా రెండేళ్ల కాలానికి కూడా బ్రాహ్మణుడు అర్హుడు కాడా జగన్ అంటే ఆయన ఏం సమాధానం చెబుతారు.
Tags:    

Similar News