అమిత్ షా అహంకారానికిది పరాకాష్ట!

Update: 2018-04-06 16:52 GMT
ఎవ్వరి బుద్ధులు ఎలాంటివో వారు అధికారంలో ఉన్నప్పుడు చూడాలి. అధికారం చెంత లేనప్పుడు అందరూ మంచివాళ్లే..అందరూ ప్రజల గురించే ఆలోచిస్తుంటారు. తనమకోసం ఎవ్వరు వచ్చినా చాలా సమయం ఇచ్చి మాట్లాడుతుంటారు. కానీ ఒకసారి అధికారం చేతికి రాగానే.. వారికి ముందు కళ్లు నెత్తికెక్కుతుంటాయి. కళ్లకు అహంకారపు పొరలు కమ్ముతుంటాయి. ఆ లెక్కన.. అమిత్ షాలో మితిమీరుతున్న అహంకారానికి.. ఇవాళ ఆయన ముంబాయిలో పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలే  నిదర్శనాలు అని పలువురు విశ్లేషిస్తున్నారు.

ముంబాయిలో అమిత్ షా.. పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును కూడా నికరంగా గుర్తు పెట్టుకోలేక పార్టీ పరువు తీసే ప్రసంగాలు సాగించే ఈ నాయకుడు... ముంబాయి ప్రసంగంలో విపక్షాలన్నిటినీ కట్టగట్టి.. చాలా చులకన చేసి మాట్లాడారు. రాజకీయ విమర్శలు-ప్రతివిమర్శలు తప్పు కాదు. కానీ.. ప్రతిపక్షాలను చులకనగా మాట్లాడడం మాత్రం ఆయనకే చెల్లింది.

‘‘విపక్షాలన్నీ కుక్కలు - పిల్లులు - ముంగిసలు - పాముల్లాంటివని.. ఓ పెద్ద ఉప్పెన వస్తే అవన్నీ చెట్టేక్కేస్తాయని’’ అమిత్ షా ఎద్దేవా చేయడం విశేషం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి ఉప్పెనలా విజృంభిస్తుందని, విపక్షాలు వరద నీటిని చూసి భయపడి చెట్టేక్కేయాలని ఆయన కోరిక. అయితే ఇక్కడ ఆయన గుర్తించాల్సిన విషయం ఒకటుందని విశ్లేషకులు అంటున్నారు.  భాజపా ఒక ఉప్పెన కావచ్చు. ఆ ఉప్పెన 2014లోనే వచ్చేసింది. పాపం.. అప్పటి విపక్షాలన్నీ దెబ్బతిన్నాయి నిజమే. కానీ వాస్తవం ఏంటంటే.. ఉప్పెన కలకాలం ఉండిపోదు.. ఏదో సీజనులో వాతావరణంలో ఉండే చికాకును బట్టి ఉప్పెన ఏర్పడుతుంది... చాలా త్వరంగానే ఆ ఉప్పెనకు కాలం చెల్లుతుంది. కానీ.. అమిత్ షా చెప్పినట్లు కుక్కలు, పిల్లులు, ముంగిసలు, పాములు అన్నీ ఉప్పెన సమయంలో చెట్టెక్కినా తమ మనుగడను కాపాడుకుంటాయి.. తిరిగి ఉప్పెన ఉధృతి తగ్గిపోగానే.. తమ పని తాము చేసుకుంటాయి. అది ప్రకృతి శాసనం.

ఇప్పుడు అమిత్ షా తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ఉప్పెన 2014 లోనే వచ్చేసింది. ఆ ఉప్పెన వెనక్కి వెళ్లడం కూడా ఇప్పుడు జరుగుతోంది. చెట్టెక్కిన పాములు - పిల్లులు - ముంగిసలు అన్నీ ఇప్పుడు కిందికి దిగుతున్నాయి. ఇక అవే విజృంభిస్తాయి.. అని ప్రజలు అనుకుంటున్నారు. ఎంతగా.. తిరుగులేని అధికారం తమ చేతిలో ఉన్నప్పటికీ.. కమలదళాధిపతి అమిత్ షా కు ఇంతటి అహంకారం కూడదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News