జస్ట్ 11.50 లక్షలతో 50 కోట్లా... వైవీ సుబ్బారెడ్డిని అందుకేనా...?

Update: 2022-09-18 00:30 GMT
బిజినెస్ అందరూ చేస్తారు. కానీ చాలా తక్కువ టైమ్ లో తక్కువ పెట్టుబడితో కోట్లు గడించేవారు కొందరే ఉంటారు. వారిని బుర్రంటే మీదే అనాలేమో. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకుని సీబీఐ  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీద కేసు పెట్టింది.  ఏపీలో సీబీఐ జగన్ మీద అక్రమాస్తుల కేసును నమోదు చేసిన సంగతి విధితమే. ఈ కేసులో ఇప్పటిదాకా చాలా మంది బయట కనిపించారు. కానీ  వైవీ సుబ్బారెడ్డి మాత్రం ఇపుడు కొత్తగా తెర మీదకు వచ్చారు. నిజానికి ఆయన మీద సీబీఐ అప్పట్లోనే కేసు నమోదు చేసింది. అయితే ఆయన మిగిలిన వారి మాదిరిగా  అరెస్ట్ కాలేదు, జైలుకు వెళ్ళలేదు.

ప్రస్తుత ప్రభుత్వంలో వైవీ సుబ్బారెడ్డి కీలక నాయకుడిగా ఉన్నారు. ఉమ్మడి విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా కూడా ఉన్నారు. ఆయన మీద  సీబీఐ ఇందూ హౌజింగ్ ప్రాజెక్ట్ విషయంలో కేసు నమోదు చేసింది. ఈ ప్రాజెక్టులో కేవలం 11.50 లక్షలు మాత్రమే వైవీ సుబ్బారెడ్డి పెట్టుబడి పెట్టారని, అయితే ఆయన వాటాగా 50 కోట్లను దక్కించుకున్నారంటూ సీబీఐ గట్తి అభియోగమే మోపింది.

దీంతో ఈ కేసు చాలా చిత్రంగా కనిపిస్తోంది. తనకేమి పాపం తెలియదు, తాను నాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ తోడల్లుడిని కాబట్టే తనను కూడా సీబీఐ తీసుకొచ్చి అకారణంగా కేసు పెట్టిందని వైవీ చెప్పుకొచ్చారు. తన మీద ఉన్న కేసుని కొట్టేయాలని ఆయన హై కోర్టుని కోరారు. అయితే ఇక్కడే సీబీఐ బలమైన వాదనను ముందుకు తెచ్చింది.

అతి తక్కువ పెట్టుబడితో  కళ్ళు చెదిరిపోయే వాటా దక్కించుకున్న వైవీని ఈ కేసులో కీలకంగానే చూస్తున్నట్లుగా సీబీఐ చెప్పింది. ఆయన మీద కేసు కొట్టివేయవద్దు అని సీబీఐ తన వాదన వినిపించింది. అంతే కాదు తన వాదనకు మద్దతుగా చాలా వివరాలను కూడా చేర్చింది. అవేంటి అంటే ఇందూ హౌసింగ్  ప్రాజెక్టు కోసం  ముందుగా కనిపించిన ఇందూ, ఎంబసీ, యూనిటీ కంపెనీలు ఆ తరువాత తప్పుకున్నాయని, ఇక ఈ ప్రాజెక్టులో ఇద్దరే మిగిలారు అని వాదించింది. వారే వైవీ సుబ్బారెడ్డి, వసంత వెంకట కృష్ణప్రసాద్ అని కోర్టు దృష్టికి తెచ్చింది.

అదే విధంగా ఇందూ హౌజింగ్ పాజెక్ట్ బోర్డులో కూడా అనేక రకాలుగా అక్రమాలు చోటు చేసుకున్నాయని సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చింది. ఇక ఈ ప్రాజెక్ట్ ని దక్కించుకున్న వసంత ప్రాజెక్ట్స్ కి దాన్ని నిర్వహించే స్తోమత లేదని, కాబట్టి ఇక్కడ వైవీ సుబ్బారెడ్డి కీలకం అని చెప్పే ప్రయత్నం చేసింది. మొత్తానికి సీబీఐ పటిష్టమైన వాదన వినిపించింది.

దాంతో తెలంగాణా హై కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. మొత్తానికి చూస్తే వైవీ కి సీబీఐ గట్టిగా బిగించేస్తోందని చెబుతున్నారు. మరి తనకు ఏ పాపం తెలియదు వైఎస్సార్ తోడల్లుడిని అయినందువల్లనే కేసు పెట్టారని వైవీ చేస్తున్న వాదనలో ఎంత పస ఉంది అన్నది కూడా హై కోర్టు తేల్చనుంది అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News