జగన్ మరో కీలక నిర్ణయం:విడిపోయిన సీబీఐ కోర్టు - పరిధిపై ఆదేశాలు

Update: 2020-02-10 16:14 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో సీబీఐ కోర్టును విడదీస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ ను జారీ చేసింది. ప్రస్తుతం సీబీఐ కోర్టు విజయవాడలో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం విడదీసిన నేపథ్యంలో బెజవాడతో పాటు పరిపాలనా రాజధానిగా చెబుతున్న విశాఖపట్నంలోనూ కొనసాగనుంది. ఈ రెండు సీబీఐ కోర్టుల పరిధిలోకి వచ్చే జిల్లాలను ఈ రోజు నోటిఫై చేసింది.

విశాఖపట్నంలో ఏర్పాటయ్యే సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం పరిధిని శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం - తూర్పు గోదావరి జిల్లాల వరకు ఉంటుందని నిర్ధారించారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన సీబీఐ కేసుల అదనపు న్యాయస్థానం పరిధి పశ్చిమ గోదావరి - కృష్ణా - గుంటూరు - ప్రకాశం - నెల్లూరు జిల్లాల వరకు ఉంటుంది.

అవినీతి నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసులను కాకుండా ఇతర కేసులను కూడా విజయవాడలోని ఐదో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి వికేంద్రీకరణ - మూడు రాజధానుల వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. అభివృద్ధి కేవలం అమరావతికే పరిమితం కావొద్దని - అందుకే తాము ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జగన్ ప్రభుత్వం చెబుతోంది. అమరావతితో పాటు విశాఖపట్నం - కర్నూలును కూడా రాజధానిగా చేయాలని నిర్ణయించారు. కర్నూలులో హైకోర్టు - విశాఖపట్నంలో పరిపాలనా భవనాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు సీబీఐ కోర్టును కూడా విడదీస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.


Tags:    

Similar News