జగన్ కు సమన్లు - ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు

Update: 2021-08-18 17:42 GMT
ఆస్తుల వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి మరో చిక్కుముడి ఎదురైంది. ఇప్పటికే సీబీఐ కోర్టులో బెయిల్ రద్దుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా జరిగిన మరో ఘటన వైసీపీలో చర్చనీయాంశం అయ్యింది. జగన్ ఆస్తుల వ్యవహరంలో విచారణలో భాగంగా జరుపుతోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానం ఆయనకు తాజాగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు సమన్లను జారీ చేశాయి.

వాన్‌పిక్‌లో భూ సేకరణ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసకుంది. జగన్ తో పాటు ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణకు కూడా సీబీఐ, ఈడీ న్యాయస్థానాలు సమన్లు జారీ చేశాయి. జగన్ తో పాట మొత్తం 10 మందికి, మరో   12 సంస్థలకు కోర్టు సమన్లు పంపింది.

సెప్టెంబర్ 22వ తేదీన విచారణకు హాజరు కావాలని సీబీఐ, ఈడీ న్యాయస్థానాలు ఆదేశించాయి. ఏపీ రాజకీయాల్లో ఇది ఒక సంచలన పరిణామంగా కనిపిస్తోంది. సమన్లు అందుకున్న వారిలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తో పాటు అధికారులు కేవీ బ్రహ్మానందరెడ్డి,  రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శామ్యూల్, ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్‌‌ ఉన్నారు. మ్యాట్రిక్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్‌లు కూడా న్యాయస్థానం నుంచి సమన్లు అందుకున్న వారిలో ఉన్నారు.

ఆగస్టు 25న బెయిల్ రద్దు పిటిషన్ తుది తీర్పు నేపథ్యంలో ఇప్పటికే అనేక విశ్లేషణలు వినిపిస్తుండగా... తాజాగా జారీ అయిన సమన్లు పార్టీలో మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. జగన్ తో పాటు సమన్లు అందుకున్న వారు అందరూ సెప్టెంబర్ 22వ తేదీన న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంటుంది. 
Tags:    

Similar News