ప్రజాసేవే ధ్యేయంగా తన పదవిని కూడా తృణప్రాయంగా వదులుకొని వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ జనసేనలో, బీజేపీలో చేరబోతున్నారంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని లక్ష్మీ నారాయణ క్లారిటీ ఇచ్చారు.
తనకు రైతుల సమస్యలను పరిష్కరించాలని ఉందని, వ్యవసాయ మంత్రి అయితే రైతులకు న్యాయం చేయవచ్చని అయితే, తాజాగా ఆర్ ఎస్ ఎస్ వలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రామానికి లక్ష్మీ నారాయణ హాజరైన నేపథ్యంలో ఆయన రాజకీయ అరంగేట్రంపై మరోసారి పుకార్లు వస్తున్నాయి. ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా లక్ష్మీ నారాయణను ప్రకటించబోతున్నారని, అందుకే ఆయన ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమానికి హాజరయ్యారని వదంతులు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లు...ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిని బీజేపీ అధిష్టానం నియమిస్తుందని ఏపీ బీజేసీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చెప్పడంతో ఆ పుకార్లకు బలం చేకూరినట్లయింది. ఈ నేపథ్యంలో ఆ ఊహాగానాలపై లక్ష్మీ నారాయణ క్లారిటీ ఇచ్చారు.
2019 ఎన్నికల్లో బీజేపీ ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థి తానే అని జరుగుతున్న ప్రచారాన్ని లక్ష్మీ నారాయణ ఖండించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు. జిల్లాల పర్యటన పూర్తయిన అనంతరం భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తానన్నారు. రైతులు సబ్సిడీలు - పథకాలను ఆశించడం లేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తే చాలనే భావనలో ఉన్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి సమస్య పరిష్కారం కావాలని, ప్రజాసేవే లక్ష్యంగా ప్రజల్లోకి వచ్చానని చెప్పారు. అయితే, క్రమశిక్షణకు మారుపేరైన లక్ష్మీనారాయణకు...ఆర్ ఎస్ ఎస్ భావజాలం నచ్చి ఉంటుందని, అందుకే ఆయన ఆ కార్యక్రమానికి హాజరై ఉంటారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అసలు రాజకీయాల్లో చేరే ఉద్దేశం లేకపోతే...ఇపుడే స్పష్టంగా చెప్పేశేవారని, భవిష్యత్ లో ప్రకటిస్తానని చెప్పరని కామెంట్స్ పెడుతున్నారు.