ముద్రగడ ఇంట మాజీ జేడీ..వాటీజ్ ద మ్యాటర్?

Update: 2019-09-20 16:17 GMT
ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో చాలా మంది అంచనాలు తలకిందులయ్యాయి. కొందరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారితే... మరికొందరి ఫ్యూచర్ తీవ్ర ప్రమాదంలో పడిపోయింది. ఇలాంటి కీలక సమయంలో శుక్రవారం ఏపీ పాలిటిక్స్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటచేసుకుంది. పాలిటిక్స్ లో కొనసాగేందుకంటూ ఖాకీ డ్రెస్ తీసేసి ఖద్దరు వేసుకున్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ... జనసేనలో చేరి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని తన భవిష్యత్తును నిజంగానే ప్రశ్నార్థకం చేసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో తన సొంత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ రాజకీయవేత్త, కాపు నేత ముద్రగడ పద్మనాభంతో ఆయన భేటీ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంట్లోనే జరిగిన ఈ భేటీపై ఇప్పుడు ఆసక్తికర చర్చలకు తెర లేసింది.

ఐపీఎస్ అధికారిగా ఓ రేంజిలో ప్రచారం సంపాదించిన లక్ష్మీనారాయణ... వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తు బాధ్యతలు స్వీకరించి సెంటర్ ఆప్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ కేసు వల్లనే సీబీఐ జేడీగానే ఆయన తనదైన ముద్ర వేయించుకున్నారు. మొన్నటి ఎన్నికలకు చాలా ముందుగానే ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ... ఏ పార్టీలో చేరాలన్న విషయంపై చాలా కాలం పాటు అలా ఉండిపోయారు. జనసేనలో చేరతారని కొన్నాళ్లు, టీడీపీలో చేరతారని మరికొన్నాళ్లు, లేదు సొంతంగానే పార్టీ పెడతారని ఇంకొన్నాళ్లు ప్రచారం జరిగినా... ఎన్నికలకు సమయం ఆసన్నమైన వేళ... ఆయన జనసేనలో చేరిపోయారు. అదే పార్టీ తరఫున విశాఖపట్టణం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి.. జనసేన మాదిరే ఘోరంగా ఓడిపోయారు.

అప్పటి నుంచి పెద్దగా కనిపించని లక్ష్మీనారాయణ... శనివారం ఉన్నట్టుండి కిర్లంపూడిలో ప్రత్యక్షమయ్యారు. ముద్రగడ పద్మనాభం ఇంటికి నేరుగా వెళ్లిన జేడీకి అక్కడ ముద్రగడ అనుచరలతో ఘన స్వాగతమే లభించింది. తన ఇంటికి వచ్చిన మాజీ జేడీని సాదరంగా ఆహ్వానించిన ముద్రగడ... టిఫిన్ కూడా పెట్టారట. ఆ తర్వాత ఇద్దరు నేతలు గంటకు పైగానే ఏకాంతంగా చర్చలు జరిపారట. ఈ చర్చల సారాంశం ఏమిటన్న విషయం ఇంకా బయటకు రాలేదు గానీ... అసలు ముద్రగడ ఇంటికి మాజీ జేడీ ఎందుకెళ్లారు అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన రాజకీయ భవిష్యత్తుపై ముద్రగడతో చర్చించేందుకే మాజీ జేడీ కిర్లంపూడి వెళ్లి ఉంటారని కూడా చాలా మంది అనుకుంటున్నారు. మరి ఈ బేటీ సారంశం ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి.



Tags:    

Similar News