వివేకా హ‌త్య కేసులో కాక రేపుతున్న సీబీఐ తాజా స్టెప్‌

Update: 2022-06-08 06:35 GMT
ఏపీసీఎం జ‌గ‌న్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణపై పులివెందుల్లో మరోసారి ఉత్కంఠ కొనసాగుతోంది. మంగ‌ళ‌వారం సీఎం జగన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి నివాసాల వద్ద సీబీఐ బృందం సర్వే కొలతలు నిర్వహించింది. ఫోటోల చిత్రీకరణతో మరోసారి సీబీఐ విచారణ చర్చనీయాంశంగా మారింది. పులివెందుల్లో అనుమానితులు, నిందితుల నివాసాల వద్ద కూడా సీబీఐ పరిశీలనతో.. వారిలో ఆందోళన మొదలైంది.

అదేవిధంగా పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా ఇంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లాను  విచారిస్తున్నా రు. ఇప్పటికే 4 సార్లు ఇనయతుల్లాను అధికారులు విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు ఆయన బెడ్ రూమ్తో పాటు, బాత్ రూమ్లో పడి ఉన్న మృతదేహాన్ని ఇనయతుల్లానే ఫొటోలు, వీడియోలు తీశారు. అతని వద్ద నుంచి కీలక సమాచారాన్ని తీసుకోవడానికి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

మొత్తంగా చూస్తే.. కేసును మ‌ళ్లీ తిర‌గ‌దోడుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇవ‌న్నీ కూడా ఏ3గా ఉన్న అప్రూవ‌ర్ ద‌స్త‌గిరి ఇచ్చిన స‌మాచారం ఆధారంగానే చేస్తున్న‌ట్టు తెలిసింది. మ‌రోవైపు వివేకా హత్య కేసులో అల్లుడు రాజశేఖరరెడ్డి, బావమరిది శివ ప్రకాశ్రెడ్డితో పాటు మరికొందరిని విచారించాలని శివశంకర్ రెడ్డి భార్య దాఖలు చేసిన పిటిషన్పై పులివెందుల న్యాయస్థానం విచారించింది.

పిటిషనర్ తులశమ్మ పేర్కొన్న విధంగా రాజశేఖర్ రెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డి, బీటెక్ రవి, కొమ్మా పరమేశ్వర్, రాజేశ్వర్ రెడ్డి, నీరుగట్టు ప్రసాద్లపై సీబీఐ విచారణ జరిపే విధంగా ఆదేశాలివ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న న్యాయస్థానం..పూర్తి వివరాలతో తులశమ్మ వాంగ్మూలం నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.  

ఇదిలావుంటే, వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన తనను అంతం చేయడానికి పులివెందులకు చెందిన వైసీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని ఏ3, వివేకా డ్రైవర్ దస్తగిరి ఆరోపించారు. గత కొద్ది రోజుల నుంచి తొండూరు మండలానికి చెందిన పెద్ద గోపాల్ అనే వ్యక్తి తరచూ తనతో.. తన కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు.

తన సోదరుడు మస్తాన్తో గొడవపడి తనను ఇష్టానుసారంగా బూతులు తిట్టడంతో పోలీస్ స్టేషన్కు వెళ్లానని.. పోలీసులు ఎదురుగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో అతనిపై తాను చేయి చేసుకున్నానని దస్తగిరి తెలిపారు. దాన్ని కారణంగా చూపి.. పోలీసులు తనపై కేసు నమోదు చేశారని దస్తగిరి తెలిపారు.
Tags:    

Similar News