ఢిల్లీ మ‌ద్యం.. టీఆర్ఎస్ ముఖ్య నేత‌లు భ‌య‌ప‌డుతున్నారా?

Update: 2022-08-19 16:30 GMT
ఢిల్లీలో తాజాగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) దాడుల నేప‌థ్యంలో తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఆందోళ‌న నెల‌కొంద‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఢిల్లీలో మ‌ద్యం పాల‌సీ అవ‌క‌త‌వ‌క‌ల వ్య‌వ‌హారంలో టీఆర్ఎస్ ముఖ్య నేత‌లున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా సీబీఐ దేశ‌వ్యాప్తంగా 21 చోట్ల దాడులు చేయ‌డం, ఏకంగా ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీలో నెంబ‌ర్ టూ నేత‌గా ఉన్న మ‌నీష్ సిసోడియా ఇంట్లోనూ సోదాలు చేప‌ట్ట‌డంతో టీఆర్ఎస్ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తుతున్నాయ‌ని చెబుతున్నారు.

ఇప్పటికే  7 రాష్ట్రాలలో 21 చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది. ఈ నేప‌థ్యంలో హైదరాబాద్‌లో కూడా సోదాలకు రెడీ ఆయినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ సమయంలో కేసీఆర్ వెంట పలువురు టీఆర్ఎస్ ముఖ్య నేత‌లు సైతం ఉండ‌టం గ‌మ‌నార్హం. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ నేతలంతా అప్ర‌మ‌త్త‌మ‌య్యార‌ని అంటున్నారు.

ఈ క్రమంలోనే తమను కూడా సీబీఐ సోదాల పేరుతో వేధించవచ్చని టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంతో ఢీ అంటే ఢీ అనేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ బీజేపీ నేత‌ల‌పైనా నిప్పులు చెరుగుతున్నారు.

వ‌చ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

దీంతో టీఆర్ఎస్ నేతలపై సీబీఐ బాణాన్ని కేంద్ర పెద్దలు ఎక్కుపెట్టే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. పైగా ఢిల్లీ లిక్కర్ పాలసీ అవకవతకల వ్యవహారంలో టీఆర్ఎస్ పెద్ద నేతలున్నట్టు ఆరోపణలు కాస్త గట్టిగానే వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. దీంతో టీఆర్ఎస్ నేతలు మరింత ఆందోళ‌న చెందుతున్నార‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News