సుపారీ సొమ్ముపై.. కూపీ లాగేందుకు సీబీఐ

Update: 2022-03-07 07:29 GMT
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య విష‌యంలో ఒక్కో విష‌యాన్ని బ‌య‌ట‌కు లాగేందుకు సీబీఐ వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారిన ఈ హ‌త్య కేసులో ద‌ర్యాప్తులో సీబీఐ స్పీడ్ పెంచ‌నుంది. అస‌లు ఈ హ‌త్య వెన‌క ఏం జ‌రిగిందో తెలుసుకునే దిశ‌గా రంగం సిద్ధం చేస్తోంది.

 అందులో భాగంగా ముందు వివేకా హ‌త్య‌కు సుపారీగా చెల్లించిన డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? ఎంత వ‌చ్చింది? అని కూపీ లాగేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టింది.

వివేకా హ‌త్య కోసం నిందితులకు సుపారీగా చెల్లించిన డ‌బ్బును వాళ్ల‌కు ఎవ‌రిచ్చారు? అంత మొత్తం ఎక్క‌డి నుంచి ఎలా వ‌చ్చింది? అనే అంశాల‌పై ఇప్ప‌టికే సీబీఐ అధికారులు కొన్ని ఆధారాలు సేక‌రించిన‌ట్లు స‌మాచారం. వివేకాను అంత‌మొందిస్తే దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తార‌ని, అందులో రూ.5 కోట్లు త‌న వాటాగా ఇస్తాన‌ని ఎర్ర గంగిరెడ్డి త‌న‌తో చెప్పార‌ని షేక్ ద‌స్త‌గిరి వాంగ్మూలం ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో వివేకా హ‌త్య‌కు ముందు.. ఆ త‌ర్వాత ఎంత డ‌బ్బు ఎవ‌రెవ‌రి చేతులు మారింద‌నే విష‌యంపై సీబీఐ ఫోక‌స్ పెట్టింది. నిందితులకు అడ్వాన్స్‌గా చెల్లించిన డ‌బ్బులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి? వాటి వెన‌క ఎవ‌రి ఆర్థిక హ‌స్తం ఉంది అనే కోణంలో ద‌ర్యాప్తు చేప‌డుతున్న సీబీఐ కొన్ని ఆధారాలు సంపాదించ‌గ‌లిగింది.

వివేకా హ‌త్య కుట్ర 2019 ఫిబ్ర‌వ‌రి 10న ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే సిద్ధ‌మైంది. ఆ త‌ర్వాత నాలుగు రోజుల‌కు సునీల్ యాద‌వ్ రూ.కోటి తీసుకు వ‌చ్చి ద‌స్త‌గిరికి సుపారీ అడ్వాన్స్‌గా ఇచ్చారు.. ఇదీ ద‌స్త‌గిరి వాంగ్మూలం ఆధారం తెలిసిన విష‌యం. దీంతో ఆ డ‌బ్బులు సునీల్ యాదవ్కు ఎవ‌రు ఇచ్చారు? అంత డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? అనే అంశాల‌పై ఇప్ప‌టికే సీబీఐ ఆరా తీసింది.

ఆ డ‌బ్బు మూలాలు తెలిస్తే కుట్ర‌దారులెవ‌రో తేలిపోతుంద‌ని సీబీఐ భావిస్తోంది. ద‌స్త‌గిరితో ఎర్ర గంగిరెడ్డి చెప్పిన మాట‌ల‌కు, సుపారీ సొత్తుకు ఎలాంటి సంబంధం ఉంది? అనే దానిపై సీబీఐ దృష్టి సారించింది. మిగ‌తా నిందితులైన ఉమాశంక‌ర్‌రెడ్డి, సునీల్ యాద‌వ‌ల్‌కూ అడ్వాన్స్ అందిందా? అనే కోణంలోనూ సీబీఐ కూపీ లాగుతోంద‌ని తెలిసింది.


Tags:    

Similar News