మోడీ కుంభ‌కోణంలో ఇంకో 5280 కోట్లు బ‌య‌ట‌ప‌డ్డాయి

Update: 2018-04-12 07:58 GMT
ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ మోసం కేసులో మ‌రో ప‌రిణామం చోటుచేసుకుంది. మెహుల్ చోక్సీ నేతృత్వంలోని గీతాంజలి గ్రూప్.. 31 బ్యాంకుల నుంచి తీసుకున్న మరో రూ.5,280 కోట్ల రుణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దృష్టి సారించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌ బీ) కుంభకోణంలో భాగంగానే దీని విచారణ జరుగుతుండగా, ఈ రుణం వివరాలను ఇప్పుడు అధికారులు తెలుసుకునే పనిలో పడ్డారు. ఐసీఐసీఐ బ్యాంక్ సారథ్యంలోని 31 బ్యాంకులు.. చోక్సీ - అతని కంపెనీలకు 2016 అక్టోబర్‌ లో ఈ రుణాలివ్వగా - ఇందులో ఐసీఐసీఐ రుణం విలువ రూ.405 కోట్లు (వడ్డీతో కలిపి రూ.773 కోట్లు). పీఎన్‌ బీ బకాయి కూడా రూ.587 కోట్లు (వడ్డీతో కలిపి దాదాపు రూ.900 కోట్లు)గా ఉంది. నిర్వహణపరమైన మూలధన సదుపాయంగా ఈ రుణాలను గీతాంజలి గ్రూప్ పొందగా - రుణాలిచ్చిన వాటిలో కార్పొరేషన్ బ్యాంక్ - బ్యాంక్ ఆఫ్ బరోడా - సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - దేనా - ఐడీబీఐ తదితర బ్యాంకులున్నాయి.

మ‌రోవైపు ఈ రుణానికి సంబంధించి ఎలాంటి కొత్త కేసు నమోదు చేయలేదని - ఫిబ్రవరి 15న దాఖలు చేసిన పీఎన్‌ బీ స్కాం ఎఫ్ ఐఆర్‌ లో భాగంగానే దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ రుణానికి - లెటర్ ఆఫ్ అండర్‌ టేకింగ్స్ (ఎల్‌ వోయూ) - ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎఫ్ ఎల్‌ సీ)లతో ముడిపడిన రూ.13,600 కోట్ల పీఎన్‌ బీ కుంభకోణానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ రుణం మంజూరులో ఏవైనా అతిక్రమణలు జరిగాయా? అన్నదానిపైనే విచారిస్తున్నామన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన గీతాంజలి ప్రమోటర్ మెహు ల్ చోక్సీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు..బుధవారం నాన్-బెయిలబుల్ వారెంట్‌ ను జారీ చేసింది. ఇప్పటికే ఆయనకు ఈ-మెయిల్ ద్వారా మూడుసార్లు సమన్లు జారీ చేశారు. దీనిపై కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. నీరవ్ మోదీపైనా గత వారం సీబీఐ ప్రత్యేక కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇదిలాఉండ‌గా...సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే పలు బ్యాంక్ ఉన్నతాధికారులను ప్రశ్నించిన సీబీఐ.. విదేశాల్లోని శాఖలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు బ్యాంక్ ఉన్నతాధికారులను బుధవారం ముంబైలో ప్రశ్నించింది. వీరిలో బహ్రెయిన్‌ లోని కెనరా బ్యాంకులో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు కాగా - బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన బెల్జియం శాఖ బ్రాంచ్ మేనేజర్ కూడా ఉన్నారు. లెటర్ ఆఫ్ అండర్‌ టేకింగ్(ఎల్‌ వోయూ)ల ద్వారా ఎలా రుణం తీసుకున్న దానిపై ప్రధానంగా వీరి నుంచి సమాచారం సేకరించినట్లు తెలుస్తున్నది.
Tags:    

Similar News