ఏపీ మంత్రి ఆ కేసు సీబీఐకి అప్పగింత!

Update: 2022-11-24 07:11 GMT
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏపీ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్న ఫోర్జరీ, మోసం, తప్పుడు పత్రాల సృష్టి కేసుకు సంబంధించిన ఆధారాలు, ఫైళ్లు నెల్లూరులోని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు నుంచి మాయం కావడంపై విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ఆదేశాలు జారీచేశారు.

ఈ కేసుకు సంబంధించిన ఆధారాల ఫైళ్లు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో దొంగతనానికి గురయ్యాయి. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్యుద్ధానికి కారణమైంది. మంత్రిని తప్పించడానికే ఆధారాలు ఉన్న ఫైళ్లను మాయం చేశారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.

ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఏపీ పోలీసులు ఆ ఫైళ్లను ఎలుకలు ఎత్తుకుపోయాయని ఒకసారి.. దొంగలు ఎత్తుకుపోయారని మరోసారి చెప్పడం ఇంకా కాక రేపింది.

వాస్తవానికి మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై విచారణ కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో, అందులోనూ కాకాణి మంత్రిగా నియమితులైన కొద్ది రోజులకే ఫైళ్లు మాయమయ్యాయి.

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసులో కీలకపత్రాలు, ఆధారాల్ని న్యాయస్థానంలో తాళాలు పగలకొట్టి మరీ దొంగలు ఎత్తుకుపోవడం సంచలనం రేపింది. మిగిలినవాటిని అన్నింటిని వదిలిపెట్టి.. మంత్రి నిందితుడిగా ఉన్న పైళ్లు, ఆధారాలు మాయం కావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చోరీకి గురైన కొన్ని పత్రాలు ఆ తర్వాత కొద్ది రోజులకు సమీపంలోని కాలువలో లభించడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఈ కేసులో రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టింది.

అప్పట్లో సీబీఐ డైరెక్టర్, డీజీపీ, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తిరిగి తాజాగా మళ్లీ విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News