ఈ సీబీఐ పెద్దాయ‌న ఓ వ‌సూల్ రాజా

Update: 2018-11-29 06:51 GMT
సీబీఐ వ‌ర్సెస్ సీబీఐ వివాదం మ‌రిన్ని మలుపులు తిరుగుతోంది. బలవంతపు వసూళ్ల కేసులలో ప్రధాన నిందితుడు సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా అని వాటి ద్వారా పూర్తిగా లబ్ధి పొందింది కూడా ఆయనేనని సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీ హైకోర్టుకు ఆస్తానా నేరాన్ని రుజువు చేసే సాక్ష్యాధారాలను సమర్పించారు. తమపై నమోదైన అవినీతి కేసులను కొట్టివేయాలని కోరుతూ రాకేశ్ ఆస్తానా - సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ పై సమాధానం ఇవ్వాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో ఏకే శర్మ ఈ మేరకు ఆధారాలను సమర్పించారు. రాకేశ్ ఆస్తానాపై వచ్చిన అవినీతి - బలవంతపు వసూళ్లకు సంబంధించిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది.

ఆస్తానా మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా విధించిన గడువును హైకోర్టు డిసెంబర్ 7వ తేదీ వరకు పొడిగించింది. రాకేశ్ ఆస్తానాకు వ్యతిరేకంగా ఏకే శర్మ సీల్డు కవర్‌లో సమర్పించిన సాక్ష్యాధారాలను స్వీకరించిన హైకోర్టు అవసరమైతే వాటిని సీబీఐ కూడా పరిశీలించవచ్చని పేర్కొంది. ఆస్తానా పలువురు సహ నిందితులు - వారి సహచరులతో సాగించిన టెలిఫోన్/వాట్సాప్ సంభాషణలను బట్టి ఆయన నేరానికి పాల్పడినట్టు తెలుస్తున్నదని ఏకే శర్మ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. మరో నిందితుడు మనోజ్ ప్రసాద్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను విశ్లేషించినప్పుడు ఓ సీనియర్ అధికారి - సోమేశ్ ప్రసాద్ - సోమేశ్ ప్రసాద్ భార్య - రాకేశ్ ఆస్తానా మధ్య పదే పదే సంభాషణలు జరిగినట్టు వెల్లడైందని తెలిపారు. తనపై నమోదైన ఎఫ్ ఐఆర్ కొట్టివేయాలంటూ ఆస్తానా దాఖలు చేసిన పిటిషన్‌ ను తిరస్కరించాలని శర్మ విజ్ఞప్తి చేశారు.

రాకేశ్ ఆస్తానాపై నమోదైన ఎఫ్ ఐఆర్ కేసు ఫైలును సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కార్యాలయానికి వెళ్లి పరిశీలించేందుకు ఢిల్లీ హైకోర్టు సీబీఐ డైరెక్టర్ అలోక్‌ వర్మ - జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మకు అనుమతినిచ్చింది. అలోక్‌ వర్మపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేసు ఫైళ్లు - ఇతర పత్రాలను సీవీసీకి తరలించామని సీబీఐ తెలిపింది. ఆస్తానా దాఖలు చేసిన పిటిషన్‌ లో తమకు వ్యతిరేకంగా కొన్ని అనుచితమైన ఆరోపణలున్నాయని - వాటిని పరిశీలించేందుకు అనుమతించాలని అలోక్‌ వర్మ - ఏకే శర్మ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఆ కేసు ఫైలును వర్మ గురువారం - శర్మ శుక్రవారం వెళ్లి పరిశీలించాలని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగానే శర్మ తరఫు న్యాయవాది మాట్లాడుతూ - ఆస్తానాపై నేరారోపణకు సంబంధించిన సాక్ష్యాధారాలను సీల్డ్ కవర్‌ లో అందజేసేందుకు అనుమతించాలని కోర్టును కోరారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు శర్మ అందజేసిన పత్రాలను ఆ సీల్డ్ కవర్‌ లోనే ఉంచాలని కోర్టు సూచించింది. అయితే ఆస్తానా తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఆ పత్రాలను సీబీఐకి అందజేయాలని, అలాగే వాటిని పరిశీలించేందుకు తమను కూడా అనుమతించాలని కోరారు.


Tags:    

Similar News