సీబీఎన్ మంత్ర : సాయిరెడ్డి సైలెంట్ అయిపోయారే !

Update: 2022-06-16 23:30 GMT
నిన్న‌టివేళ చోడ‌వ‌రం (ఉమ్మ‌డి విశాఖ జిల్లా) లో మినీ మ‌హానాడు నిర్వ‌హించి, వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు వేణుంబాక విజ‌య సాయిరెడ్డి పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అదేవిధంగా ఇక్క‌డి ఏ2 పెత్త‌నం పై నిప్పులు చెరిగారు. విశాఖ రీజ‌న‌ల్ ఇంఛార్జిగా సాయిరెడ్డిని తొల‌గించి సుబ్బారెడ్డిని నియ‌మించ‌డమేనా సామాజిక న్యాయం అంటూ మండిప‌డ్డారు. విశాఖ‌లో ఏ2 పెత్త‌నం చేస్తున్నాడు. ఆయ‌న‌కేం ప‌ని ఇక్క‌డ ? మొత్తం దోచేస్తున్నాడు. ఉత్త‌రాంధ్ర‌పై విజ‌య సాయిరెడ్డి పెత్త‌నం ఏంటి ? అని మండిపడ్డారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై ఇంకా సాయిరెడ్డి స్పందించ‌లేదు. మ‌హానాడు అయిపోగానే నిన్న రాత్రి ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి, ఉత్త‌రాంధ్ర వైసీపీ లీడ‌ర్ గుడివాడ అమ‌ర్నాథ్ మాత్రమే స్పందించారు. ఆయ‌న కొన్ని మాట‌లు చెబుతూ అధికారంలో ఉన్న తామేం చేశామో వివ‌రించారు. మ‌హానాడును బూతుల నాడు అని అభివ‌ర్ణించారు. అంతేకానీ సాయిరెడ్డిపై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లను మాత్రం తిప్పికొట్ట‌లేక‌పోయారు అన్న‌ది నిజం.

ఇక విశాఖ‌ను కాపాడుకోవాల్సిందేనంటూ చంద్ర‌బాబు పిలుపు ఇస్తూనే, సాయిరెడ్డి తో స‌హా పలువురి పై వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా మ‌ట్టి తవ్వ‌కాల‌పై గ‌ళం వినిపించారు. అదేవిధంగా 3 రాజ‌ధానులకు సంబంధించి వైసీపీ చెబుతున్న మాట‌ల‌నూ ఉటంకించారు మ‌రోసారి. ప్ర‌స్తావించారు మ‌రోసారి.

అదేవిధంగా తాము అధికారంలో ఉన్న‌ప్పుడు విశాఖ‌ను ఏ విధంగా అభివృద్ధి చేయాల‌నుకున్నామో చెబుతూ, పోల‌వ‌రం ప‌నుల్లో భాగంగానే  ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతికి సంబంధించి ప‌నులు చేప‌ట్టాల‌ని నిర్ణయించామ‌ని కానీ ఇప్ప‌టిదాకా సంబంధిత ప‌నుల్లో పురోగ‌తి లేకుండా పోయింద‌ని ఆవేద‌న చెందారు. వీటన్నింటిపై సాయిరెడ్డి ఏం మాట్లాడ‌నున్నారో అన్న‌ది ఆస‌క్తిదాయ‌కంగా మారింది.

చంద్ర‌బాబుది రాక్ష‌సానందం అని మాత్రం గుడివాడ అమ‌ర్నాథ్ ఓ కీల‌క వ్యాఖ్య చేసి వెళ్లారే  కానీ  సాయిరెడ్డిపై చంద్ర‌బాబు చేసిన ఏ మాట‌నూ తిప్పికొట్ట‌క‌పోవ‌డం నిజంగానే ప్ర‌స్తావించ‌ద‌గ్గ, గ‌మ‌నించ‌ద‌గ్గ విషయం. బుధ‌వారం రాత్రి మీడియా మీట్ పెట్టాక గ‌తంలో చెప్పిన మాట‌లే చెప్పి ఊరుకున్నారే కానీ విశాఖ‌ను తాము ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా ఏ విధంగా కాపాడుతున్నామో అన్న‌ది చెప్ప‌లేక‌పోయారు. పోనీ వ‌య‌సు రీత్యా చిన్న‌వాడ‌యిన మంత్రి  చెప్ప‌లేక‌పోయారు క‌నీసం ఎంపీ హోదాలో ఉంటూ, దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేస్తున్న సాయిరెడ్డి అయినా మాట్లాడి, త‌మ స‌చ్ఛీల‌త చాటుకోవాల‌ని సోష‌ల్ మీడియాలో.. టీడీపీ  వ్యాఖ్య‌లు చేస్తోంది.

స‌ర్వ‌సాధార‌ణంగా త‌న‌పై విప‌క్ష నేత‌లు ఎవ్వ‌రు విమ‌ర్శ‌లు చేసినా ఓర్వ‌లేని, స‌హించ‌లేని సాయిరెడ్డి ఎందుక‌ని సైలెంట్ అయిపోయారు అని అంటోంది. ముఖ్యంగా ప్ర‌కృతి అందాల‌తో అల‌రారే విశాఖ వాకిట పర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు వైసీపీ స‌ర్కారు అధికారం చేప‌ట్టాక చేసిన ప‌నులేంటో చెబితే తామెంతో  సంతోషిస్తామ‌ని కూడా అంటోంది.
Tags:    

Similar News