హైద‌రాబాద్‌కే ప‌రిమితం కానున్న చంద్ర‌బాబు

Update: 2018-11-25 06:50 GMT
తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు వారాల స‌మ‌యం కూడా లేదు. అభ్య‌ర్థులంతా త‌మ శాయ‌శ‌క్తుల‌ను కూడ‌గ‌ట్టుకొని ప్ర‌చార ప‌ర్వం కొన‌సాగిస్తున్నారు. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఒకే రోజు 3-4 బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌సంగిస్తూ దూసుకెళ్తున్నారు. మేడ్చ‌ల్‌లో సోనియా గాంధీ స‌భ విజ‌య‌వంతం కావ‌డంతో కాంగ్రెస్‌, ప్ర‌జా కూట‌మి శ్రేణుల్లోనూ న‌వోత్సాహం క‌నిపిస్తోంది. కాంగ్రెస్‌తోపాటు టీడీపీ - టీజేఎస్‌ - సీపీఐ అభ్య‌ర్థులు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిరుగుతూ ప్ర‌చారం చేస్తున్నారు.

త‌ల్లి సోనియా గాంధీతో క‌లిసి ఇప్ప‌టికే మేడ్చ‌ల్ స‌భ‌లో పాల్గొన్న ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మ‌రో రెండుసార్లు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు విచ్చేయ‌నున్నారు. ఈ నెల 28 - 29 తేదీల్లో ఆయ‌న తెలంగాణ‌లో ప్ర‌చారం నిర్వ‌హిస్తారు. 28న కొడంగ‌ల్‌, ఖ‌మ్మం, గ‌జ్వేల్ స‌భ‌ల్లో రాహుల్ ప్ర‌సంగిస్తారు. ఆ మ‌రుస‌టి రోజు తాండూరు, భూపాల‌ప‌ల్లి, ఆర్మూరుల్లో ఎన్నిక‌ల స‌భల్లో పాల్గొంటారు.

అనంత‌రం డిసెంబ‌రు 3న రాహుల్‌ హైద‌రాబాద్‌కు వ‌స్తారు. భారీ రోడ్ షోలో పాల్గొంటారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని 18 నియోజ‌క‌వ‌ర్గాల గుండా ఈ రోడ్ షో సాగుతుంది. ఈ భారీ రోడ్ షోలో రాహుల్‌తోపాటు టీడీపీ అధినేత - ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా పాల్గొంటారు.

ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. చంద్ర‌బాబు ఈ రోడ్ షోలో మిన‌హా తెలంగాణ‌లో ఎక్క‌డా ఎన్నిక‌ల ప్ర‌చారంలో క‌నిపించ‌బోర‌ట‌. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన చంద్ర‌బాబుకు తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. టీడీపీకి రాష్ట్రమంత‌టా కార్య‌క‌ర్త‌లున్నారు. ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చాక చంద్ర‌బాబు ఏపీకే ప‌రిమిత‌మైనా క్షేత్ర‌స్థాయిలో టీడీపీ ఇప్ప‌టికీ బ‌లంగానే ఉంది. అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చింది. కాబ‌ట్టి చంద్ర‌బాబు రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌జా కూట‌మి అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తే బాగుంటుంద‌ని ప‌లువురు భావించారు. అయితే, చంద్ర‌బాబు అందుకు సుముఖంగా లేన‌ట్లు క‌నిపిస్తోంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల్లోనే టీడీపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుండ‌టంతో ఆ స్థానాల వ‌ర‌కే ప్ర‌చారానికి ఆయ‌న మొగ్గు చూపిన‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News