ట్రంప్ అయితేనేం.. దుమ్మ రేపేలా తిట్టేసింది

Update: 2017-01-09 07:43 GMT
అమెరికా అంటే అమెరికానే. ప్రజాస్వామ్యానికి.. భావస్వేచ్ఛకు అక్కడ పెద్దపీట వేస్తారని చెబుతారు. ప్రెసిడెంట్ అయినా తమకు నచ్చని పని చేస్తే అక్కడి మీడియా దగ్గర నుంచి ప్రముఖుల వరకూ అందరూ విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెట్టేందుకు ఏ మాత్రం వెనక్కితగ్గరు. మనకు మాదిరి.. అధికారంలో ఉన్న వారిని ప్రసన్నం చేసుకునేలా వ్యవహరించే మీడియా సంస్థలు.. సెలబ్రిటీల తీరుకు అమెరికా పూర్తి భిన్నమనే చెప్పాలి.

అదెంత నిజమన్న విషయం తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై.. మరికొన్ని రోజుల్లో అధ్యక్ష పగ్గాలు అందుకోనున్న డోనాల్డ్ ట్రంప్ పై హాలీవుడ్ నటి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. యావత్ ప్రపంచం మొత్తం దృష్టి సారించే ఒక అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో త్వరలో అధ్యక్షస్థానంలో కూర్చునే ట్రంప్ పై ఆమె ఫైర్ అయ్యారు.

భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగిన అవార్డుల ఫంక్షన్ లో అవార్డు పొందిన ప్రముఖ నటి సెసిల్ బి డిమిల్లీ తన ప్రసంగంతో వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశారు.ట్రంప్ తీరును తీవ్రంగా తప్పు పట్టిన ఆమె.. ఆయన మాటలు తననెంతో బాధకు గురి చేశాయని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కీళ్ల ముడత వ్యాధితో బాధపడే ఒక విలేకరిని(న్యూయార్క్ టైమ్స్) అనుకరిస్తూ ట్రంప్ హావభావాల్ని తీవ్రంగా తప్పు పట్టారు.

‘‘ఆయన్ను చూసి మిగిలినోళ్లు అలానే చేస్తారు. గత ఏడాదిలో నేను షాక్ తిన్న నటన అది. అది నా మనసును తీవ్రంగా కలిచివేసేలా చేసింది. ఎందుకంటే.. అందులో మంచి అస్సలు లేదు. అలాంటి చేష్టల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఒక వికలాంగుడ్ని వెక్కరించే వ్యక్తి దేశంలోని అత్యున్నత స్థానంలో కూర్చోవటానికి వీలుగా ప్రజల్ని కోరుకునే సమయంలో చోటు చేసుకున్న ఘటన అది. ఇప్పటికీ ఆ సన్నివేశాన్ని మర్చిపోలేకపోతున్నాను’’ అని వ్యాఖ్యానించారు.

ఇలాంటివి సినిమాలో కాకుండా నిజ జీవితంలో చోటు చేసుకోవటం వేదనను కలిగించిందన్నారు. ఇలా ఒకరిని అనుకరించి కించపర్చటం మిగిలిన వారిని కూడా ప్రోత్సహించటం లాంటిదేనని.. అగౌరవం అగౌరవాన్నే ఆహ్వానిస్తుందని.. హింస.. హింసనే ప్రోత్సహిస్తుందన్నారు. శక్తివంతులైన వారు ఇతరుల్ని వేధిస్తే.. అది అందరికి నష్టమని.. మీడియా తన శక్తిని కోల్పోకూడని ఆమె వ్యాఖ్యానించారు.

మీడియా స్వేచ్ఛ ఎప్పటికి కావాలన్న వాదనను వినిపించిన ఆమె ప్రసంగం ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకోవటమే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. కాబోయే అధ్యక్షుల వారి తీరును నిశితంగా విమర్శించిన వైనంతో ట్రంప్ తీరు ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చిందని చెప్పాలి. ఈ ఫంక్షన్లో మరికొందరు నటులు కూడా ట్రంప్ పై విమర్శలు చేయటం గమనార్హం. అధికారాన్ని చేతబట్టే వారి మనసుల్ని దోచుకోవాలని.. వారికి సన్నిహితంగా వ్యవహరించాలనుకునే తీరుకు భిన్నంగా.. చేసిన తప్పును నలుగురిలో కడిగిపారేయటానికి కూడా వెనక్కి తగ్గని అమెరికన్ సెలబ్రిటీలను చూస్తే సంతోషంగా ఉండటమే కాదు.. భావస్వేచ్ఛ అమెరికాలో ఇంకా బతికే ఉందన్న భావన కలగటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News