మోడీ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ వేళ‌.. ప్ర‌ముఖులు చిన్న‌బోయారే!

Update: 2019-05-31 05:07 GMT
మొత్తానికి మోడీ కేబినెట్ కొలువు తీరింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని సాధించిన వేళ‌.. దేశ ప్ర‌ధానిగా రెండోసారి బాధ్య‌త‌లు చేప‌ట్టే క్ర‌మంలో మోడీ నిర్వ‌హించిన భారీ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం వేడుక‌గా సాగింది. రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు.. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల్ని పెద్ద ఎత్తున పిలిచి.. పండ‌గ చేసుకున్న రీతిలో మోడీ త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వాన్ని నిర్వ‌హించారు.

ఈ ప్ర‌మాణోత్స‌వ కార్య‌క్ర‌మంలో హైలెట్ ఏమిటంటే.. వివిధ రంగాలకు చెందిన తోపుల్లాంటి ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. రాజ‌కీయ ఉద్దండులే కాదు.. వ్యాపార‌.. వాణిజ్య‌.. సినిమా.. క‌ళ‌లు.. ఇలా ప్ర‌తి రంగానికి చెందిన వారిని ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. దేశ ఆర్థిక స్థితికి కీల‌క‌మైన వ్యాపార దిగ్గ‌జం.. మోడీ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌టం ఒక ఎత్తు అయితే.. గుంపులో గోవిందం మాదిరి మారిపోయారు.

భారీ ఎత్తున ప్ర‌ముఖులు హాజ‌రు కావ‌టంతో.. ఒక‌రికి మించిన తోపులు మ‌రొక‌రు కావ‌టంతో అక్క‌డ ప్ర‌ముఖులంతా ఒక‌టిగా మారిపోతే.. వారంద‌రికి బిగ్ బాస్ మాదిరి మోడీ క‌నిపించిన ప‌రిస్థితి.

దీనికి త‌గ్గ‌ట్లే వేదిక‌ను కూడా ఏర్పాటు చేశార‌ని చెప్పాలి. దేశ విదేశాల‌కు చెందిన ప్ర‌ముఖులంతా రాష్ట్రప‌తి భ‌వ‌న్ విశాల ప్రాంగ‌ణంలోని ఓపెన్ ఏరియాలో కూర్చునేందుకు సీట్లు ఏర్పాటు చేస్తే.. వారంద‌రికి మించిన ఉన్న‌త స్థానంలో ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ వేదిక‌.. ఆ ప‌క్క‌నే త‌న టీంతో మోడీ ఆసీనుల‌య్యారు. యావ‌త్ దేశాన్ని పాలించే త‌మ టీంకు.. మిగిలిన ప్ర‌ముఖుల‌కు మ‌ధ్య దూరాన్ని ఈ వేదిక చెప్పేసింద‌ని చెప్పాలి.

వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులంతా ఒక్క‌చోట చేరిన ఈ ప్రోగ్రాంలో మ‌రో విశేషం ఏమంటే.. తోపుల్లాంటోళ్లంతా చిన్నబోవ‌టం. బాలీవుడ్ మొత్తాన్ని ప్ర‌భావితం చేసే ప్ర‌ముఖుడు.. ఎక్క‌డికి వెళ్లినా అగ్ర ఆస‌నం ద‌క్కుతుంది. అలాంటి ఆయ‌న‌.. మోడీ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం వేళ‌.. ఎక్క‌డో ఓ ప‌క్క‌న సీటు కేటాయించారు. ఇది చిన్న ఎగ్జాంఫుల్ మాత్ర‌మే. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్ర‌ముఖులు చాలామంది టీవీ కెమేరా కంటికి కూడా క‌నిపించ‌ని ప‌రిస్థితి. మోడీ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా హాజ‌రైన ప్ర‌ముఖుల్లో కొంద‌రికైనా చాలా స్ప‌ష్టంగా అనిపించే అంశం ఏమంటే.. మోడీ ప‌వ‌ర్ ముందు తాము చాలా త‌క్కువ‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేసింద‌ని చెప్పాలి.
Tags:    

Similar News