పండిట్లు.. సిక్కుల ఊచ‌కోత‌ల‌కు తిరిగి ఇవ్వ‌లేదే?

Update: 2015-11-02 17:30 GMT
సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు.. వివాదాస్ప‌ద అంశాల‌కు దూరంగా ఉంటూ త‌మ‌కెందుకులే అన్న‌ట్లు ఉండే ప్ర‌ముఖులు.. సెల‌బ్రిటీలలో చైతన్యం ఒక్క‌సారిగా వెల్లి విరిస్తోంది. ఇంత‌కాలం ఏమైపోయిందో తెలీదు కానీ.. ఇప్పుడిప్పుడే ఉన్న‌ట్లుండి పుట్టుకురావ‌టం.. వాటిని బాహాటంగా చెప్పేయ‌ట‌మే కాదు.. ప్ర‌భుత్వం ఇచ్చిన పుర‌స్కారాల్ని సైతం వెన‌క్కి ఇచ్చేస్తాన‌ని చెప్పేస్తున్నారు. ఇంత‌వ‌ర‌కూ సాహితీ ప్ర‌ముఖులు.. సినిమాల‌కు చెందిన బుద్ధ‌జీవులుగా చెప్పుకునే వారు త‌మ పుర‌స్కారాల్ని వెన‌క్కి ఇచ్చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌రికొంద‌రైతే వెన‌క్కి ఇచ్చేసిన‌ట్లు ప్ర‌క‌టించేశారు.

తాజాగా యాభై పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ప‌ర‌మ‌త స‌హ‌నం త‌గ్గుతుంద‌ని.. దీనికి కార‌ణ‌మైన కేంద్ర‌ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా తాను త‌న పుర‌స్కారాన్ని తిరిగి ఇచ్చేందుకు సైతం వెనుకాడ‌న‌ని చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా త‌న కెరీర్‌ లో త‌న మ‌తం కార‌ణంగా ఇబ్బందులు ప‌డ్డాన‌ని.. సూప‌ర్ స్టార్ అయ్యాక విదేశాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాన‌ని చెప్పుకొచ్చారు.

మ‌త స‌హ‌నం త‌గ్గిపోవ‌టంపై వీరూ వారూ అన్న తేడా లేకుండా రాష్ట్రప‌తి.. ఆర్‌ బీఐ గ‌వ‌ర్న‌ర్‌.. ఇన్ఫోసిస్ నారాయ‌ణ‌మూర్తి మొద‌లు చాలామంది ప్ర‌ముఖులు వ్యాఖ్య‌లు చేసేస్తున్నారు. తోచిన స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు. మ‌త స‌హ‌నానికి భంగం వాటిల్లుతోంద‌ని ఇన్ని మాట‌లు చెబుతున్న వారు.. ల‌క్ష‌లాది కాశ్మీరీ పండిట్ల‌ను త‌రిమి కొట్టిన‌ప్పుడు.. అక్క‌డెక్క‌డో ఉన్న కాశ్మీర్ నుంచి ఢిల్లీ వీధుల వ‌ర‌కు త‌రిమిన‌ప్పుడు ఈ చైత‌న్య‌మూర్తుల చైత‌న్యం ఎక్క‌డికి వెళ్లింది? ఇందిరాగాంధీని చంపింది సిక్కు అంగ‌ర‌క్ష‌కుడు కాబ‌ట్టి సిక్కు అనేవాడిని క‌నిపిస్తే చంపేసిన దారుణం రోజున మాట‌లు మూగ‌బోయాయి ఎందుకు? అవ‌న్నీ చాలా పాతకాలం నాటి మాట‌లు అనుకుందాం?

హైద‌రాబాద్ న‌డి బొడ్డున బంగ్లాదేశ్ ర‌చ‌యిత్రి త‌స్లీమా న‌స్రీన్‌ ను మ‌జ్లిస్ ఎమ్మెల్యేల గుంపు ఒక‌టి చుట్టుముట్టి భౌతిక‌దాడి చేసిన‌ప్పుడు ఒక్క‌రంటే ఒక్క మేధావి ఎందుకు స్పందించ‌లేదు? త‌మ‌కు ప్ర‌భుత్వాలు ఇచ్చిన పుర‌స్కారాలు ఎందుకు తిరిగి ఇవ్వ‌లేదు? ఒక ఆడ‌కూతురుపై దాడి చేసి.. చంపేయ‌త్నం చేసిన ప్ర‌జాప్ర‌తినిధుల బృందంపై వెంట‌నే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న మాట‌ను చెప్పాల‌ని కూడా ఎందుకు అనిపించ‌లేదు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి.

మేధావుల విష‌యంలోనే కాదు.. మీడియా విష‌యంలోనూ అడ‌గాల్సిన ప్ర‌శ్న‌లు ఉన్నాయి. అయోధ్యలోని వివాదాస్ప‌ద క‌ట్ట‌డాన్ని కూల్చివేసిన సంఘ‌ట‌న‌లో సుప్రీంకోర్టు మాట‌కు వ్య‌తిరేకంగా.. భిన్నంగా దానికి పేరు త‌గిలించి వేలాది ట‌న్నుల న్యూస్‌ప్రింట్ ఎలా అచ్చేశారు? అయోద్య‌లో ఉన్న‌ది వివాదాస్ప‌ద క‌ట్ట‌డ‌మ‌ని.. దాన్ని అలానే వ్య‌వ‌హ‌రించాల‌ని స్ప‌ష్టంగా చెప్పినా.. మీడియా ఎందుకు ప‌ట్టించుకోదు?

ఇలాంటి ప్ర‌శ్న‌లు వేసిన వారిపై సంఘ్ ప‌రివార్ అన్న ముద్ర వేయ‌ట‌మో.. లేదంటే హిందుత్వ అతివాది అన్న ముద్ర వేస్తారే త‌ప్పించి.. అత‌గాడి ఆవేద‌న‌ను ప‌ట్టించుకోరు.

ఈ దేశంలో అంద‌రూ స‌మాన‌మే. ఒక‌రు ఎక్కువ‌? మ‌రొక‌రు త‌క్కువ అన్న‌ది లేదు. అలాంట‌ప్పుడు మైనార్టీల పేరు చెప్పి.. దాన్నో ఓటుబ్యాంకుగా మార్చిన మేధావులు.. తాము చేస్తున్న‌ది త‌ప్ప‌న్న‌ది తెలీదా? ఒక‌రిని బుజ్జ‌గించ‌టానికి.. వారిని ఆక‌ర్షించ‌టానికి.. ఓటుబ్యాంకు రాజ‌కీయాల‌కు పాల్ప‌డే విష‌యాన్ని మేధావులు.. పండితులు.. సెల‌బ్రిటీలు చూసీ చూడ‌న‌ట్లుగా ఎందుకు ఉంటారు? దానిని ఎందుకు ప్ర‌శ్నించ‌రు?

ఇలాంటివి చూసిన‌ప్పుడే అంద‌రూ స‌మానం అని చెబుతూ.. స‌మానుల్లో ప్ర‌ధ‌ములన్న‌ట్లుగా కొంద‌రికి పెద్ద‌పీట వేయ‌టం.. కొంద‌రి విష‌యంలో అతి ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శించ‌టం.. చివ‌ర‌కు కొన్ని వ‌ర్గాలు చేసే తీవ్ర నేరాల‌కు సైతం వారి నేప‌థ్యం చెప్పుకొచ్చి వారికి వేయాల్సిన శిక్ష‌లు త‌గ్గించాలంటూ వాద‌న‌లు తీసుకురావ‌టం మ‌న‌కు మాత్ర‌మే చెల్లుబాటు అవుతుందేమో. ఒక వ్య‌క్తి మ‌రో వ్య‌క్తిని చంపితే.. స‌ద‌రు వ్య‌క్తి అగ్ర‌వ‌ర్ణం వాడైతే ఒళ్లు బ‌లిసి ఆ పని చేశాడ‌ని.. అదే అణ‌గారిన వ‌ర్గానికి చెందిన వాడైతే.. అవ‌గాహ‌నారాహిత్యంతో.. చ‌దువు లేని సామాజిక ప‌రిస్థితుల‌తో అలాంటి నేరానికి పాల్ప‌డి ఉండొచ్చ‌న్న వాద‌న ఏమిటి? త‌ప్పు చేసిన వాడు ఎవ‌రైనా త‌ప్పు త‌ప్పే. అగ్ర‌వ‌ర్ణానికి చెందిన వారు హ‌త్య చేస్తేనే ప్రాణం పోతుంది.. అణ‌గారిన వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి హ‌త్య చేస్తే ప్రాణం పోకుండా ఉండ‌దు క‌దా. హ‌త్య అంటే ప్రాణం పోవ‌ట‌మే. అలాంట‌ప్పుడు ప్రాణం తీసిన దానికి ఒక‌టే శిక్ష ఉండాలి కానీ.. వ‌ర్గాల వారీగా శిక్ష‌లు విధించ‌టం ఏమిటి?
శిక్ష ప‌డ్డ వారికి కూడా సామాజిక వ‌ర్గాలో.. ఇంకేదో చూపించి.. చెప్పి వారికి క్ష‌మాభిక్ష ప్ర‌సాదించ‌మ‌ని చెప్ప‌టం.. ఆ విష‌యంలో చ‌ట్టం క‌రుకుగా వ్య‌వ‌హ‌రిస్తే.. మొత్తం వ‌ర్గానికే ఏదో అన్యాయం జ‌రిగిన‌ట్లుగా ప్ర‌చారం చేయ‌టాన్ని ఏమ‌నాలి? మెమ‌న్ ను ఉరితీసే స‌మ‌యంలో అత‌డి మీద సానుభూతి ప్ర‌ద‌ర్శించిన వారికి.. ముంబ‌యి పేలుళ్ల సంద‌ర్భంగా మ‌ర‌ణించిన వంద‌లాది కుటుంబాలు.. ఉగ్ర‌భూతం కార‌ణంగా రోడ్డు మీద ప‌డిన కుటుంబాలు గుర్తుకు రావా?

అయినా ప్రాణం తీసే బాంబు.. తాను చంపాల్సింది ఫ‌లానా వారినే అని చూసుకొని చంప‌దు క‌దా. అలాంట‌ప్పుడు అంత దుర్మార్గానికి పాల్ప‌డిన వ్య‌క్తి వ‌ర్గాన్ని.. నేప‌థ్యాన్ని చూసి శిక్ష విధించాల‌ని ఎందుకు కోరుకుంటున్నారు? ఇలాంటి వైరి భావ‌న‌లతో అసంతృప్తి రాదా?  మేధావులు.. బుద్ధ‌జీవులు.. సెలబ్రిటీలు బాధ్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిటి? అయినా.. ఒక గ్రామంలో జ‌రిగిన దానికి కేంద్రం బాధ్య‌త వ‌హించాల‌ని కోర‌టం ఏమిటి? అదే నిజ‌మైతే.. కారంచేడు.. చుండూరు ఘ‌ట‌న‌ల‌కు నాటి కేంద్రాన్ని ఎందుకు త‌ప్పు ప‌ట్ట‌లేదు? దాని బాధ్య‌త‌ నాటి కేంద్ర‌ప్ర‌భుత్వాల మీద వేసేసి.. అందుకు నిర‌స‌న‌గా ఎందుకు త‌మ త‌మ పుర‌స్కారాల్ని వెన‌క్కి ఇవ్వ‌లేదు? ఎందుకు మాట్లాడ‌లేదు..? ఇలాంటి ఎన్నోప్ర‌శ్న‌ల‌కు అంద‌రిని స‌మంగా చూసే కోట్లాదిమంది భార‌తీయుల‌కు స‌మాధానాలు కావాలి. మ‌రి.. పుర‌స్క‌రాలు తిరిగి ఇచ్చేసే వారు స‌మాధానాలు చెబుతారా? లేక‌.. వారిని స‌మ‌ర్థించే వారు స‌మాధానాలు చెబుతారా..?
Tags:    

Similar News