అలా చేస్తే.. అది 'అత్యాచార‌మే': కేంద్రం

Update: 2022-11-29 14:30 GMT
బలవంతంగా మతం మార్పించడమన్నది మతస్వేచ్ఛ పరిధిలోకి రాదని, అలా చేయ‌డం ఒక వ్య‌క్తిపై నిర్బంధ అత్యాచారం కింద‌కే వ‌స్తుంద‌ని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.  ఇతరులను బలవంతంగా మతం మార్పించడమన్నది మతస్వేచ్ఛ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

మోసం, బలప్రయోగం, ఆకర్షణల ద్వారా మతమార్పిళ్లకు పాల్పడితే మతస్వేచ్ఛను ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. అలాంటి చర్యలను నిరోధించేందుకు అవసరమైన చట్టాలు చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది.

భయపెట్టడం, బహుమతులు అందజేయడం, ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ద్వారా దేశంలో మతమార్పిళ్లు చోటుచేసుకుంటున్నాయని.. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం తాజా వివరాలతో కోర్టులో సంక్షిప్తంగా ఓ ప్రమాణపత్రాన్ని సమర్పించింది.

బలవంతపు మతమార్పిళ్ల సమస్య తీవ్రత గురించి తమకు తెలుసని అందులో పేర్కొంది. అశ్వినీకుమార్‌ పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ.. మతస్వేచ్ఛను పరిరక్షించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది.

ఈ అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం స్పందిస్తూ.. మతమార్పిళ్లకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది.

అయితే బలవంతపు మతమార్పిళ్లు ఎంతమాత్రమూ సముచితమైనవి కావని పేర్కొంది. ఈ అంశంపై రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరించి సమగ్ర ప్రమాణపత్రం సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News