దొంగ ఓట్లకు చెక్ పడుతుందా ? డౌటే

Update: 2022-07-29 05:31 GMT
తొందరలోనే దొంగ ఓట్లకు చెక్ పడే అవకాశం ఉందని అనుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఓటర్ల జాబితాతో ఆధార్ కార్డును అనుసంధానించటానికి కేంద్ర ఎన్నికల కమీషన్ శ్రీకారం చుడుతోంది. ఆగస్టు 1వ తేదీ నుండి ఈ ప్రక్రియకు కమీషన్ ప్రత్యేకంగా డ్రైవ్ ప్రారంభించబోతోంది.

ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని అనుకుంటున్న ఓటర్లు తమ ఆధార్ కార్డును ఓటర్ కార్డుతో లింక్ చేయవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా ప్రకటించింది.

తమ ఓటు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయించుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఈ ప్రక్రియను కాదనవచ్చు. అనుసంధానం కోసం ఆగష్టులో మొదలవబోతున్న ప్రక్రియ వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు జరుగుతుంది.

ఆధార్ కార్డును ఇవ్వటం ఇష్టంలేదని చెప్పినంత మాత్రాన వాళ్ళ ఓటును జాబితానుండి తీసేయరు అని కమీషన్ స్పష్టంగా ప్రకటించింది. ఓటర్ల గుర్తింపును నిర్ధారించుకునేందుకు మాత్రమే ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని కూడా చెప్పింది.

బూత్ స్థాయి అధికారి తొందరలోనే తన పరిధిలోని ప్రతి ఇంటికి వస్తారు. ఓటర్ల జాబితాలో పేరును సరిచూసుకుని ఆధార్ కార్డు అనుసంధానం కోసం ఆధార్ నెంబరు అడుగుతారు. అప్పుడు ఇష్టముంటే ఆధార్ నెంబర్ చెప్పవచ్చు లేకపోతే నిరాకరించవచ్చని కమీషన్ ప్రకటించింది. ఆధార్ కార్డ్ ఇవ్వటం ఇష్టంలేని ఓటర్లకు బూత్ లెవల్ అధికారి ఫారం 6 బీ దరఖాస్తులో పేర్కొన్న 11 ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒకటి ఇవ్వచ్చని కూడా కమీషన్ చెప్పింది.

ఓటరు కార్డుతో ఆధార్ నెంబర్ ను లింక్ చేయటం కోసం ఎన్నికల కమీషన్ కొత్తగా ఫారం-6 బీ దరఖాస్తును తీసుకొచ్చింది. ఎన్నికల సంఘం వెబ్ సైట్, నేషనల్ ఓటర్ సర్వీసు పోర్టల్ వెబ్ సైట్ లో తొందరలోనే  దరఖాస్తులు అందుబాటులోకి వస్తాయి. ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా కూడా లింక్ చేసుకోవచ్చు. దొంగ ఓట్లను ఏరేసేందుకు ఎన్నికల కమీషన్ చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News