కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌: ‌కొత్త ప‌థ‌కాలకు రాం రాం

Update: 2020-06-05 11:10 GMT
ఇప్ప‌టికే లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేలు కాగా ఆదాయం రాక ఖ‌జానా ఖాళీ అయ్యింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం పొదుపు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగా కొత్త ప‌థ‌కాలు ఇక‌పై ఉండ‌వ‌ని, రూపొందించ‌లేమ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దేశంలో కేసులు పెరుగుతున్న క్రమంలో ఖర్చును తగ్గించే పనిలో భాగంగా ఈ ఏడాది ఎలాంటి కొత్త పథకాలు ఉండవని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టం చేసింది.

నూతన పథకాల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎలాంటి ప్రతిపాదనలూ పంపవద్దని అన్ని మంత్రిత్వ శాఖలకు ఈ సంద‌ర్భంగా సమాచారం చేరవేసింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్‌ యోజన ప్యాకేజ్‌తో పాటు ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజ్‌ అమలుకే ఖర్చును పరిమితం చేస్తామని వెల్ల‌డించింది. ఇతర పథకాలను ఈ ఆర్థిక సంవత్సరంలో అనుమతించమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వైర‌స్ వ్యాప్తితో ప్రభుత్వ ఆర్థిక వనరులకు అసాధారణ డిమాండ్‌ నెలకొన్న క్రమంలో మారుతున్న ప్రాధాన్యాలకు అనుగుణంగా వాటిని సవ్యంగా వినియోగించుకోవాల్సి ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

బడ్జెట్‌లో ప్రకటించిన పథకాలు కూడా మార్చి 31వ తేదీ వరకు నిలిచిపోతాయని తెలిపింది. ఈ నూతన నిబంధనలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలన్నా దానికి వ్యయ విభాగం అనుమతి అవసరమని కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొంది.
Tags:    

Similar News