కొత్త వాదన: 3 రాజధానులు తేలదా? ఇరుకున పడ్డ కేంద్రం

Update: 2020-09-12 14:30 GMT
అమరావతి పేరిట చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ ను పక్కనపెట్టిన సీఎం జగన్ ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడ రాజధానిని చేయవద్దని కంకణం కట్టుకొని విశాఖకు రాజధాని తరలించాలని పట్టుదలగా ఉన్నారు. కానీ కోర్టులకు ఎక్కి అమరావతి రైతులు, టీడీపీ అడ్డుకుంటోంది. కానీ జగన్ సర్కార్ మాత్రం విశాఖను రాజధాని చేయడానికే వడివడిగా ముందుకెళుతోంది.

అయితే విభజన చట్టం ప్రకారం మూడు రాజధానుల ఏర్పాటుకు కానీ.. రాజధాని పేరు మార్పుకు కానీ అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. రాష్ట్రపతి , కేంద్రం నోటిఫై చేస్తేనే కానీ మార్పులు చేయడం కుదరదని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు మళ్లీ రాష్ట్రపతి ద్వారానే మార్పులు చేయాల్సి ఉంటుందని అంటున్నారు.

తాజాగా అమరావతిలో హైకోర్టు సాధన సమితి నిర్వహించిన చర్చాగోష్టిలో పాల్గొన్న సుప్రీం కోర్టు న్యాయవాది శ్రీనివాసరావు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఆర్టికల్ 4 ప్రకారం పాలన ఎక్కడి నుంచి జరగాలనేది రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. వికేంద్రకరణ చట్టం ప్రకారం రాజధాని తరలింపు కుదరదన్నారు.

అయితే తాజాగా కేంద్రం మాత్రం మూడు రాజధానులకు ఓకే అనడం.. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం కేవలం రాజకీయ కారణంతోనేనన్న వాదన తెరపైకి వస్తోంది. కానీ అంతిమంగా విభజన చట్టంలో మార్పులు మాత్రం తప్పనిసరిగా జరిగితే మూడు రాజధానులు ఏర్పాటు చేయవచ్చని.. హైకోర్టులో రాజధానుల మార్పు చెల్లదని న్యాయనిపుణులు అంటున్నారు.

మూడు రాజధానుల ఏర్పాటులో ఏర్పడుతున్న జాప్యానికి ఏపీ పునర్విభజన చట్టంలోని చిక్కుముడులే కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పట్లో తేలే అవకాశాల్లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి జగన్ సర్కార్ ఈ మూడు రాజధానులపై ఎలా ముందుకెళుతుందనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News