జగన్ కు చెక్ పెట్టేందుకు ఎల్వీని కేంద్రానికి తీసుకెళ్లనున్నారా?

Update: 2019-11-06 04:18 GMT
అదును కోసం ఎదురుచూస్తున్న మోడీ సర్కారు జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని భావిస్తోందన్న మాట వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న అంతిమ లక్ష్యాన్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సపరేటుగా ప్లాన్ సిద్ధం చేసిన బీజేపీ అధినాయకత్వం.. అందుకు తగ్గట్లే అడుగులు వేస్తోంది.మిగిలిన పార్టీల మాదిరి కాకుండా స్లో అండ్ స్టడీ అన్న రీతిలో ప్లానింగ్ చేస్తుందంటారు.

వేటాడే సింహం ఆహారం కోసం ఎంత ఓపిగ్గా ఎదురుచూస్తుందో.. అదే రీతిలో బీజేపీ తీరు ఉంటుందని చెబుతారు. తాను వేట మొదలు పెట్టిన విషయాన్ని సైతం బయటకు రాకుండా వ్యవహరించి.. అదును చూసి కోలుకోలేని దెబ్బ తీయటం మోడీషాలకు అలవాటుగా చెబుతారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణ నేపథ్యంలో తొందరపడకూడదన్నట్లు ఉన్న కమలనాథులు.. తాజాగా తమకొచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఉన్నపళంగా అప్రాధాన్యత పోస్టుకు బదిలీ చేసిన వైనాన్ని కేంద్రం నిశితంగా గమనిస్తోంది. తాను ఏరి కోరి తెచ్చుకున్న ఉన్నతాధికారినే జగన్ పక్కన పెట్టిన నేపథ్యంలో.. ఇప్పుడు ఎల్వీని బీజేపీ పెద్దలు ఆయుధంగా వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దీనికి తగ్గట్లే ఈ మధ్యన బీజేపీలో చేరి అమిత్ షాకు సన్నిహితంగా మెలిగే సుజనా చౌదరి ఈ అంశం మీద మాట్లాడుతూ.. ఏపీలో సీఎస్ ను బదిలీ చేసిన విధానం ఘోరంగా ఉందనటం గమనార్హం. కేంద్రం అన్ని గమనిస్తోందని.. కళ్లు మూసుకు లేదంటూ ఆయన చేసిన హెచ్చరికల్ని చూస్తే.. సీఎం జగన్ నిర్ణయంపై కేంద్రం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆయన్ను కేంద్ర సర్వీసులకు తీసుకెళ్లి.. కీలక పదవి అప్పజెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎల్వీ పదవీ కాలం నాలుగు నెలలు మాత్రమే ఉండటం.. దాన్ని పొడిగించటం ద్వారా జగన్ మీద ఆయుధంగా వాడొచ్చన్న మాట వినిపిస్తోంది. జగన్ ప్రభుత్వ గుట్టుమట్లతో పాటు.. యువనేత రాజకీయ వ్యూహాన్ని కొంతమేర అయినా తెలుసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది.

బీజేపీ పెద్దలు కోరుకున్నట్లే.. ఎల్వీ సైతం కేంద్రసర్వీసుల్లో పని చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగల కార్యం గంధర్వులే చేసినట్లు.. తాము కోరుకున్నది ఎల్వీ అనుకుంటున్నది ఒకటే కావటంతో త్వరలోనే ఆయన్ను కేంద్ర సర్వీసులోకి తీసుకెళ్లటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News