16 ఏళ్లు..131 టెస్టులు..ఒక్క గాయమూ లేదు..ఎవరా దిగ్గజ ఆల్ రౌండర్?
టీమ్ ఇండియాను తొలిసారి ప్రపంచ విజేతగా నిలిపిన నాయకుడు కపిల్ దేవ్. 1983 ప్రపంచ కప్ లో కపిల్ డెవిల్స్ సాధించిన అద్భుత విజయం భారత క్రికెట్ గతినే మార్చేసింది.
ఒకటీ రెండేళ్లు కాదు.. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్. ఈ కాలంలో ప్రధాన పేస్ బౌలర్ అతడే.. కెప్టెన్ కూడా చేశాడు.. బ్యాట్ తోనూ విలువైన పరుగులు చేశాడు.. ఫీల్డింగ్ లోనూ అద్భుతం.. మొత్తం 131 టెస్టులు ఆడితే.. వరుసగా 66.. మధ్యలో ఒక మ్యాచ్ గ్యాప్ తో 65 టెస్టులు.. కానీ, ఎక్కడా గాయం అన్నదే లేదు. ఇది అందరినీ ఆశ్చర్యపోయేలా చేసే నిజం.. అది కూడా మన భారత క్రికెటర్ విషయంలోనే కావడం గమనార్హం.
టీమ్ ఇండియాను తొలిసారి ప్రపంచ విజేతగా నిలిపిన నాయకుడు కపిల్ దేవ్. 1983 ప్రపంచ కప్ లో కపిల్ డెవిల్స్ సాధించిన అద్భుత విజయం భారత క్రికెట్ గతినే మార్చేసింది. ఇక కపిల్ 1977 నుంచి 1993 వరకు ఆడితే ఒక్క టెస్టు (1984, కోల్‌కతాలో)కు మాత్రమే దూరమయ్యాడు. అయితే, ఇది గాయం కారణంగా కాదు.
ఆ కాలంలోనే..
భారత క్రికెట్ లో సచిన్ తర్వాత అత్యధిక కాలం కొనసాగిన అతి తక్కువ మందిలో కపిల్ ఒకడు. 1970లు, 1980ల్లో ఇప్పట్లా ఫిజియోలు, న్యూట్రిషనిస్టులు లేరు. టి20లు కూడా లేవు కాబట్టి.. పని భారం అనేది కూడా ఉండకపోయేది. అయినా.. కపిల్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింట్లోనూ చురుగ్గా ఉండేవాడు. ఈ లెక్కన అతడిపై ఎంత భారం పడేదో ఊహించలేనిదేమీ కాదు.
అలాంటివాడు పుడతాడా?
కపిల్ 1993లో రిటైరయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లోనే కాదు.. అద్భుతమైన ఫిట్ నెస్ లోనూ. అతడిలాంటి గొప్ప ఆల్ రౌండర్ మరొకరు ఇంతవరకు టీమ్ ఇండియాకు దొరకలేదంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కపిల్ ఫిట్ నెస్ రహస్యంపై ఓ థీసిస్ చేయొచ్చేమో..? ఎందుకంటే.. 1983 ప్రపంచ కప్‌లో జింబాబ్వేపై 17 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ కు దిగిన అతడు చరిత్రలో మరుపురాని ఇన్నింగ్స్ (175 నాటౌట్) ఆడాడు. ఆ తర్వాత 11 ఓవర్లు బౌలింగ్ చేశాడు.
ఐపీఎల్ వేలంలో 50 కోట్ల ఆటగాడు కపిల్ దేశవాళీ, కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు. కానీ, గాయం అనేదే ఎరుగడు. అలాంటి కపిల్ గనుక ఇప్పుడు ఉండి ఉంటే.. ఐపీఎల్ వేలంలో రూ.50 కోట్లయినా పెట్టి కొనేవారు. ఈ మాట కొన్నేళ్ల కిందటే వచ్చింది.
కొసమెరుపు: 2007 వన్డే ప్రపంచకప్ లో భారత్ ఘోర పరాజయం తర్వాత కపిల్ భారత క్రికెట్ ను ప్రక్షాళన చేసేందుకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. అది చివరకు రద్దయింది. ఐఎస్ఎల్ ను బీసీసీఐ గుర్తించలేదు. దీని తర్వాత ఐపీఎల్ వచ్చింది.