భారత గడ్డపై నెట్ ఫ్లిక్స్ పాక్ పాట..నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు

నెట్ ఫ్లిక్స్ కు ఉన్న ఆదరణ రీత్యా ఈ డాక్యుమెంటరీ విశేష ఆసక్తి నెలకొంది. తీరా చూస్తే డాక్యుమెంటరీలో చాలా వాస్తవాలను దాచిపెట్టారంటూ నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు.

Update: 2025-02-09 09:50 GMT

పాకిస్థాన్ పై భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎన్ని అద్భుత ఇన్నింగ్స్ లు ఆడాడు..? ప్రపంచ కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ జరిగిన ప్రతిసారీ మాస్టర్ బ్లాస్టర్ చెలరేగేవాడు..

2022లో జరిగిన టి20 ప్రపంచ కప్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాడు..? కళ్లు చెదిరే ఆ ఇన్నింగ్స్ టి20ల చరిత్రలోనే హైలైట్..

..కానీ, ఇవేవీ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కు కనిపించడం లేదట. దానికి పాకిస్థాన్ ప్రతిభ మాత్రమే కనిపిస్తోందట.. ఒకటికి రెండుసార్లు ఇలా జరగడంతో భారత నెటిజన్లు మండిపడుతున్నారు. అతిపెద్ద మార్కెట్ అయిన మన దేశ ప్రేక్షకులను నెట్ ఫ్లిక్స్ ఏవిధంగా చూస్తున్నదో దీనిద్వారా తెలిసిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెట్‌ ఫ్లిక్స్ ఇండియాపై పక్షపాతం ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. కాస్త వామపక్ష భావజాలం కనిపిస్తోందంటూ విమర్శలు వినిపించాయి. గతంలో ఎందుకలా జరిగింది? ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారా? అనేది చర్చనీయం కూడా అయింది. అయితే, ఆ తప్పులను దిద్దుకోకపోగా మళ్లీ పక్షపాత ఎజెండాతో పనిచేస్తోందనే విమర్శలు మూటగట్టుకుంటోంది.

ఈ నెల 19 నుంచి పాకిస్థాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సందర్భంగా భారత్-పాకిస్థాన్ గత మ్యాచ్ ల విశేషాలతో స్పోర్ట్స్ డాక్యుమెంటరీ 'ది గ్రేటెస్ట్ రివాల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్' ట్రైలర్ గతవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు డాక్యుమెంటరీ

విడుదలైంది.

నెట్ ఫ్లిక్స్ కు ఉన్న ఆదరణ రీత్యా ఈ డాక్యుమెంటరీ విశేష ఆసక్తి నెలకొంది. తీరా చూస్తే డాక్యుమెంటరీలో చాలా వాస్తవాలను దాచిపెట్టారంటూ నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. పాక్ కు లేని కీర్తిని ఆపాదిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఇది దారుణం అంటూ నిప్పులు చెరుగుతున్నారు.

షార్జాలో జరిగిన మ్యాచ్‌ లో పాకిస్థాన్ రిగ్గింగ్ చేసి గెలిచినట్లు డాక్యుమెంటరీలో చూపించలేదని.. షోయబ్ అక్తర్ బౌలింగ్‌ ను సచిన్ అద్భుతంగా ఎదుర్కొన్న ఇన్నింగ్స్‌ ను చూపించలేదని మండిపడుతున్నారు.

విరాట్ కోహ్లి అద్భుత ప్రదర్శనలీలో కొన్నింటిని తప్పించారని.. అతడిని తక్కువ చేసి చూపే ప్రయత్నం ఇదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'ఐసీ 814: ది కాందహార్ హైజాక్', 'ఖాకీ: ది బిహార్ చాప్టర్' తదితర ప్రాజెక్టులతో భారతీయుల సెంటిమెంట్‌ ను దెబ్బతీసిందనే విమర్శలు గతంలో వచ్చాయి. అయినా, పద్ధతి మార్చుకోకుండా తాజాగా డాక్యుమెంటరీలోనూ పక్షపాత చూపిందనే బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. భారత్ వంటి భారీ మార్కెట్ పట్ల ఓ అంతర్జాతీయ సంస్థ వ్యవహరించాల్సిన తీరు ఇది కాదనే అభిప్రాయం వినిపిస్తోంది.

Tags:    

Similar News