వచ్చాడు.. 150 బాదేశాడు.. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ సంచలనం!

అది కూడా స్వదేశంలో కాదు.. ఆతిథ్య జట్టు దేశంలోనూ కాదు.. తటస్థ దేశంలో కావడం విశేషం.

Update: 2025-02-10 16:30 GMT

తొలి అంతర్జాతీయ మ్యాచ్ లో అర్థ సెంచరీ చేయడమే గగనం. సెంచరీ చేస్తే గొప్పగా భావిస్తారు. కానీ, అతడు ఏకంగా 150 బాదేశాడు. అది కూడా స్వదేశంలో కాదు.. ఆతిథ్య జట్టు దేశంలోనూ కాదు.. తటస్థ దేశంలో కావడం విశేషం. ఈ క్రమంలో అతడు ఎన్నో రికార్డులు బద్దలుకొట్టాడు.

మాథ్యూ బ్రీట్జ్‌కే నిన్నటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో ఎవరికీ తెలియని పేరు. కానీ, ఇప్పుడు అతడి పేరిట గొప్ప రికార్డు నమోదైంది. సోమవారం పాకిస్థాన్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 150 పరుగులు చేశాడు. ఇతడికి ఇది తొలి అంతర్జాతీయ వన్డే.

చాంపియన్స్ ట్రోఫీ ముంగిట పాకిస్థాన్‌ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ మధ్య ముక్కోణపు సిరీస్‌ జరుగుతోంది. ఈ సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా చాలామంది కొత్తవారికి చోటిచ్చింది. అలాంటివారిలో మాథ్యూ ఒకడు. కీలక ఆటగాళ్లందరూ సౌత్ ఆఫ్రికా టి20 (ఎస్ఏటి20) లీగ్ లో ఉండడంతో మాథ్యూ వంటివారికి ముక్కోణపు సిరీస్ లో అవకాశం దక్కింది.

సోమవారం లాహోర్‌ లోని గడాఫీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా మ్యాచ్ లో 26 ఏళ్ల బ్రీట్జ్‌కే అరంగేట్రం చేశాడు. 148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు.

దీంతో వన్డేల్లో అరంగేట్రంలోనే 150 రన్స్‌ చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఇది వెస్టిండీస్ బ్యాటర్, ఓపెనర్ డెస్మండ్ హేన్స్ (148 పరుగులు, 1978లో ఆస్ట్రేలియాపై ) పేరిట ఉండేది.

వచ్చే నెలలో మొదలయ్యే ఐపీఎల్‌ సీజన్‌ లో బ్రీట్జ్‌కే లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడనున్నాడు. ఇతడిని ఎల్‌ఎస్‌జీ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.

బ్రీట్జ్‌కే, హేన్స్‌ మాత్రమే కాక రెహ్మానుల్లా గుర్బాజ్‌ (అఫ్గానిస్థాన్)-127: ఐర్లాండ్‌పై 2021లో, మార్క్‌ చాప్‌ మన్ (హంకాంగ్‌)-124*: యూఏఈపై 2015లో, కోలిన్ ఇంగ్రామ్ (దక్షిణాఫ్రికా)-124: జింబాబ్వేపై 2010లో అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేశారు.

Tags:    

Similar News