టీమ్ ఇండియా 'స్టార్'.. దేశవాళీ క్రికెట్ పిచ్ పైకి దిగొచ్చాడు

కొన్నిసార్లు వాటిలో రాణించినవారికే జాతీయ జట్టులో చోటు దక్కుతోంది.

Update: 2025-01-09 15:30 GMT

ఇంగ్లండ్ లో కౌంటీలు కానీ.. ఆస్ట్రేలియాలో షెఫీల్ షీల్డ్ కానీ.. భారత్ లో రంజీ ట్రోఫీ కానీ.. క్రికెట్ దేశవాళీ టోర్నీలు చాలా కీలకం. ఇప్పుడంటే ఐపీఎల్ తో పాటు ఆయా దేశాలకు టి20 లీగ్ లు వచ్చాయి. ఒకప్పుడు అంతా దేశవాళీ టోర్నీలే. ఇందులో రాణించినవారే హీరోలు. ఆపై జాతీయ జట్టులోకి వచ్చేసినట్లే. కానీ, లీగ్ లు వచ్చాక అంతా తారుమారైంది. కొన్నిసార్లు వాటిలో రాణించినవారికే జాతీయ జట్టులో చోటు దక్కుతోంది. అయితే, అంతర్జాతీయ టి20లు, వన్డేలకు ఇది పనికొచ్చిందేమో కానీ.. టెస్టులకు వచ్చేసరికి ఆటగాళ్ల ప్రదర్శన తేలిపోతోంది. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ (బీజీటీ) సిరీస్‌ లో మరింత స్పష్టమైంది.

బీజీటీలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కూడా అంతే. వీరసలు టెస్టులకు పనికి వస్తారా? అనే సందేహమూ కలిగింది. వీరేకాదు సీనియర్ కేఎల్ రాహుల్, కుర్రాడు శుబ్ మన్ గిల్ కూడా ఫెయిల్ అయ్యారు. దీంతో వీరంతా దేశవాళీలను నిరక్ష్య చేసినందుకే మూల్యం చెల్లించుకున్నారనే విమర్శలు వచ్చాయి.

ఇలాగైతే కష్టమే..

ఒక్క స్థానానికి ఐదుగురు పోటీ పడే జాతీయ జట్టులో వరుసగా వైఫల్యాలు ఎదురైతే మనుగడ కష్టం. దీనిని పరిగణనలోకి తీసుకునే ఏమో కొందరు ఆటగాళ్లు దేశవాళీ బాట పట్టారు. గురువారం విజయ్‌ హజారే టోర్నీ నాకౌట్‌ మ్యాచ్ లలో ఆడారు. కర్ణాటకకు ప్రసిద్ధ్‌ కృష్ణ, దేవ్‌ దత్‌ పడిక్కల్‌.. తమిళనాడుకు వాషింగ్టన్‌ సుందర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కర్ణాటకకే చెందిన కేఎల్‌ రాహుల్‌ రెస్ట్ కోరాడు. ఈ నెల 23నుంచి మొదలయ్యే రంజీ ట్రోఫీ రెండో రౌండ్‌ మ్యాచ్‌ లకు అందుబాటులో ఉండనున్నాడు. ఆస్ట్రేలియా టూర్ చేదు గురుతులతో ఫిట్‌, అందుబాటులో ఉంటే కచ్చితంగా దేశవాళీల్లో ఆడాలని కోచ్‌ గంభీర్‌ ఆటగాళ్లకు స్పష్టం చేశాడు.

తెలుగు కుర్రాడు సైతం..

తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ లో అదరగొట్టాడు. అతడు రంజీ ట్రోఫీ రెండో రౌండ్లో ఆంధ్రాకు ఆడనున్నాడు.

కోహ్లి 12 ఏళ్ల తర్వాత..

విరాట్ కోహ్లి 2013లో సొంత రాష్ట్రం ఢిల్లీకి రంజీ ట్రోఫీ ఆడాడు. మరి ఈసారైనా అతడు రంజీ ఆడతాడా? లేదా? అనేది చూడాలి. మరోవైపు రోహిత్ 9 ఏళ్లుగా దేశవాళీ మ్యాచ్ లు ఆడలేదు. గిల్, జడేజా కూడా నాలుగేళ్లుగా రంజీల్లో పాల్గొనలేదు. ఇప్పుడు వీరంతా దేశవాళీలు ఆడనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News