చైనాకు బ్రేకులు వేసేలా..మోడీ సర్కార్ కీలక నిర్ణయం

Update: 2020-04-19 04:44 GMT
కరోనా పుణ్యమా అని ప్రపంచ దేశాలన్ని అతలాకుతలమైపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక కిందామీదా పడుతున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోవటమే కాదు.. ఏళ్లకు ఏళ్లు వెనక్కి వెళ్లే దుస్థితి. ఎప్పటికి కరోనా కోరల నుంచి ప్రపంచం ఫ్రీ అవుతుందన్నది ఒక పట్టాన అర్థం కావట్లేదు. సందట్లో సడేమియా అన్నట్లుగా చైనా కంపెనీలు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. కరోనా కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసే ప్రయత్నాల్ని చైనా కంపెనీలు ముమ్మరం చేశాయి.

ఇటీవల హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు షేర్లలో 1.01 శాతం వాటాను కొనుగోలు చేసింది పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా. దీంతో ఒక్కసారిగా అలెర్టు అయిన మోడీ సర్కారు తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పు తీసుకుంటూ ఆదేశాల్ని జారీ చేసింది. ఇప్పటివరకూ రెండు రకాలైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. భారత్ లో విదేశీ కంపెనీలు ఏవైనా పెట్టుబడి పెట్టాలంటే.. ఒకటి నేరుగా సదరు కంపెనీల్లో పెట్టుబడి పెట్టేయటం. రెండో విధానంలో ప్రభుత్వ అనుమతితో పెట్టుబడులు పెట్టటం. మొదటి విధానంలో కీలక మార్పులు చేసింది కేంద్ర సర్కారు.

తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం చైనా కంపెనీలు భారత్ లో పెట్టుబడి పెట్టాలంటే తప్పనిసరిగా కేంద్ర సర్కారు అనుమతి తప్పనిసరి. ఇప్పటివరకూ ఇదే తీరును పాకిస్థాన్.. బంగ్లాదేశ్ మీద పరిమితులు ఉన్నాయి. తాజాగా చైనా కంపెనీల మీద ఇదే తరహా ఆంక్షల్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పలు కంపెనీల్ని టైం చూసి మరీ చేజిక్కించుకునేలా పావులు కదపటాన్ని గుర్తించిన కేంద్రం.. అందుకు చెక్ పెట్టేలా నిర్ణయాన్ని తీసుకుంది. ఏ కంపెనీనైనా చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే తప్పనిసరిగా కేంద్ర సర్కారు అనుమతి అవసరం. భారత్ లోనే కాదు.. అమెరికాలోని పలు కంపెనీల్లోనూ చైనా పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది.

భారత్ తో సరిహద్దులు పంచుకునే దేశాలకు చెందిన కంపెనీలు కానీ.. పౌరులు కానీ దేశంలోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలంటే అందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అంటూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ కొత్త మార్గదర్శకాల్ని ప్రకటించింది. రక్షణ.. టెలికాం.. ఫార్మాతో సహా మొత్తం పదిహేడు రంగాల్లోని కంపెనీల్లో నిర్దేశిత శాతాన్ని మించిన విదేశీ పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంపై రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఎందుకిలా? అంటే.. లాక్ డౌన్ వేళ అదును చూసుకొని విదేశీ కంపెనీలు దేశీయ కంపెనీల్ని కొనుగోలు చేసే వైనాన్ని అడ్డుకోవాలంటూ రాహుల్ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన కేంద్రం తాజాగా ఆంక్షల్ని విధించటాన్ని ప్రస్తావిస్తూ మోడీ సర్కారు నిర్ణయానికి తన మద్దతును తెలియజేశారు.
Tags:    

Similar News