గ్రీన్‌ - ఆరెంజ్‌ - రెడ్ వారీగా.. లాక్‌ డౌన్ అమ‌లు

Update: 2020-04-12 15:48 GMT
దేశంలో కరోనా వ్యాప్తి నివారణకు ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించిన లాక్‌ డౌన్ ఏప్రిల్ 14వ తేదీతో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో కొన్ని రాష్ట్రాలు లాక్‌ డౌన్ త‌మ రాష్ట్రాల్లో పొడిగించ‌గా అయితే దేశ‌వ్యాప్తంగా లాక్‌ డౌన్ పొడిగిస్తారా లేదోన‌నే చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలో కేంద్రం నుంచి ప‌లు సంకేతాలు వ‌చ్చాయి. లాక్‌ డౌన్‌ ను పొడిగించాల‌నే ఉన్నా ప్ర‌స్తుతం దేశంలో క్లిష్ట ప‌రిస్థితులు ఉన్నాయ‌ని వెనకాముందు అవుతోంది. ఇప్ప‌టికే 24 రోజుల లాక్‌ డౌన్‌ తో దేశానికి తీవ్ర న‌ష్టం వాటిల్లింది. మ‌రికొన్ని పొడిగిస్తే ప‌రిస్థితి చేయి దాటుతుంద‌ని ఆందోళ‌న చెందుతోంది. ఈ క్ర‌మంలో మ‌ధ్యే మార్గంగా కొన్ని స‌డ‌లింపులతో లాక్‌ డౌన్ కొన‌సాగించాల‌ని సూత్ర‌ప్రాయ అంగీక‌రానికి వ‌చ్చింద‌ని స‌మాచారం. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రుల వీడియో కాన్ఫ‌రెన్స్‌ ల విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి మాట్లాడిన తీరు ఆ విధంగానే ఉంది.

అయితే లాక్‌ డౌన్ మ‌రో రెండు వారాల పాటు పొడిగించి ప్రజలకు కాస్త వెసులుబాటు కల్పించేందుకు ఓ కలర్ కోడ్ రూపొందిస్తార‌ని తెలుస్తోంది. భారతదేశ‌ మ్యాప్‌ లో కలర్ జోన్లను గుర్తించ‌నున్నారు. రెడ్ - ఆరెంజ్ - గ్రీన్ రంగుల్లో భార‌త‌దేశంలోని ప్రాంతాల‌ను గుర్తిస్తారు.  ఈ మూడు రంగులను విభజించడం వల్ల ప్రజల రాకపోకలకు అవరోధం ఉండదని - ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కొంత పునరుద్ధ‌రించకునే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. కరోనా ప్ర‌భావం చూప‌ని ప్రాంతాల్లో లాక్‌ డౌన్ నిబంధనలను సడలించే అవకాశాలు ఉన్నాయి. ఆ మూడు రంగుల జోన్ల ఏమిటంటే..

గ్రీన్ జోన్: ఈ జోన్ పరిధి కిందకు వచ్ఛే ప్రాంతాలంటే కరోనా ప్ర‌భావం పూర్తిగా లేని జిల్లాలుగా గుర్తిస్తారు. దేశంలో ప్ర‌స్తుతం 400 జిల్లాల్లో క‌రోనా కేసులు లేవని ప్రభుత్వం గుర్తించింది.

ఆరెంజ్ జోన్: కొన్ని ప్రాంతాల్లో లేదా జిల్లాలో 15కు మించి కరోనా కేసులు ఉన్న వాటిని గుర్తిస్తారు. ఆ సంఖ్య కొంచెం పెర‌గొచ్చు.. త‌గ్గొచ్చు. ఈ విధమైన జిల్లాల్లో పరిమితంగా ప్ర‌జా ర‌వాణాను అనుమతించడం - వ్యవసాయోత్పత్తులకు అనువుగా హార్వెస్టింగ్ కి అనుమతి ఇస్తార‌ని స‌మాచారం.

రెడ్ జోన్‌: 15 కరోనా కేసులకు మించిన జిల్లాలను రెడ్ జోన్ కిందకు చేర్చారు. అంటే క‌రోనా వైర‌స్ తీవ్రంగా ప్ర‌బ‌లిన ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో లాక్‌ డౌన్ సంపూర్ణ‌గా విధించ‌నున్నారు. ఎలాంటి స‌డ‌లింపులు లేకుండా తీవ్ర ఆంక్ష‌లు అమ‌లుచేసే జోన్ ఇది.

Tags:    

Similar News