కేసీఆర్ కోరికను తీర్చిన మోడీ సర్కారు

Update: 2016-04-07 04:26 GMT
ఆదాయం మీద రంది మామూలే. కానీ.. అప్పులు చేసే విషయంలో విపరీతమైన ఉత్సాహాన్ని ప్రదర్శించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో. తెలంగాణ రాష్ట్రంలో తాను చేపట్టిన సంక్షేమ కార్యాక్రమాలకు భారీగా నిధులు అవసరమైన నేపథ్యంలో.. అప్పులు చేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా వాడేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రం నుంచి తనకున్న రుణ పరిమితిని పెంచుకోవటానికి కిందా మీదా పడుతున్న సంగతి తెలిసిందే.

రుణ పరిమితిని పెంచుకోవటం ద్వారా మరింత అప్పు తీసుకునే వీలు ఉండటంతో.. ఈ అంశంపై కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని బయటకు చెప్పుకున్నారు కూడా. తమలాంటి సంపన్న రాష్ట్రాలకు రుణ పరిమితిని మరింత పెంచే అవకాశం ఉందని.. అలాంటి అవకాశాన్ని వినియోగించుకొని మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా చెప్పుకోవటం తెలిసిందే.

గత కొద్దిరోజులుగా తెలంగాణ సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు తాజాగా కేంద్రం ఓకే చెప్పేసింది. ఇప్పటివరకూ ఉన్న అప్పు పరిమితి 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం కారణంగా మరో రూ.2300 కోట్లు అదనంగా రుణం తీసుకునే వెసులుబాటు తెలంగాణ ప్రభుత్వానికి కలుగుతుంది.

తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏర్పడిన నాటి నుంచి అప్పుల మీద అప్పులు చేస్తూ.. 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాటాకు చేసిన అప్పుల్ని కేవలం తమ 22 నెలల పాలనలో ఓ రేంజ్ లో చేస్తున్న అప్పుల మీద తెలంగాణ విఫక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అయినప్పటికీ.. ఆ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా మరింత అప్పు మీద తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేయటం గమనార్హం. తాజాగా కేంద్రం పెంచిన అప్పు పరిమితితోమరో రూ.2,300 కోట్లు అప్పు చేసే వెసులుబాటు తెలంగాణ సర్కారుకు కలగనుంది.
Tags:    

Similar News