జగన్ కు మోడీ సర్కార్ గుడ్ న్యూస్

Update: 2019-07-31 07:30 GMT
నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. తనకు ఏపీ ప్రయోజనాలు తప్పించి మరింకేమీ అక్కర్లేదని.. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని పలు వేదికల మీద ప్రస్తావించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై మోడీ సర్కార్ గుర్రుగా ఉండటం తెలిసిందే. తొలుత జగన్ ప్రభుత్వంపై మోడీ నజర్ బాగానే ఉన్నా.. ఏపీలో పార్టీని విస్తరించాలన్న ఆలోచనతో ఏపీ సర్కారుపై కత్తి కట్టినట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్లే ఏపీ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నట్లుగా కొన్ని పరిణామాలు స్పష్టం చేశాయి.

ఏపీ ప్రభుత్వం కోరిన ప్రతి విషయానికి ఏదోలా కొర్రీలు పెట్టుకుంటూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా తన మైండ్ సెట్ మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో పాటు.. ఏపీ ప్రయోజనాల విషయంలో జగన్ కమిట్ మెంట్ ను గుర్తించినట్లుగా చెబుతున్నారు. తాజాగా ఏపీ సర్కారుకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ క్యాడర్ కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులను ఏపీకి బదిలీ చేసే విషయంలో సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ సర్కారు ఏర్పాటు తర్వాత తెలంగాణ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ ఏపీకి బదిలీ చేయాలని కోరుతూ విన్నపాన్ని పెట్టుకున్నారు. అదే సమయంలో  మరో సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర సైతం తనను ఏపీకి పంపాలని కోరారు.

అయితే.. వీరిద్దరి ఫైల్ పై కేంద్రం కొర్రీ పెట్టటం తెలిసిందే. పలు సాకుల్ని చూపించిన కేంద్రం.. వారి ఫైళ్లకు క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా కేంద్రం పెద్దలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జరిపిన మంతనాలు.. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ అధికారుల్ని కలిశారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో కేంద్రం సానుకూలంగా రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. జగన్ సర్కారుకు గుడ్ న్యూస్ చెప్పేలా.. ఇద్దరు సీనియర్ అధికారుల్ని ఏపీ కి పంపుతూ అధికారిక నిర్ణయాన్ని త్వరలో వెల్లడిస్తారని చెబుతున్నారు.
Tags:    

Similar News