నవంబరులో బాబుకు భారీ షాకిచ్చేందుకు రెడీ అవుతున్న కేంద్రం

Update: 2019-08-15 04:45 GMT
రాజకీయంగా బాగా దెబ్బతిన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు నవంబరు నెలలో భారీ షాక్ తగలబోతోందని సమాచారం. సీబీఐ కేసులతో ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేయడానికి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయని దిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే, ఈ కేసులు ఎలా ఉంటాయి.. ఏఏ వ్యవహారాలకు సంబంధించిన కేసులు బిగిస్తారన్నది ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు.

మరోవైపు చంద్రబాబు కూడా ఇలాంటిది జరగొచ్చన్న అంచనాతో ఉన్నారని.. అందుకే ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వంపై చూపినంత దూకుడు ఇప్పుడు చూపడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఆయన మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీతో జట్టుకట్టి - ఇతర జాతీయ నేతలను కలుపుకొంటూ హడావుడి చేశారు. ముఖ్యంగా ఆయన ప్రత్యేక హోదా పోరాటం చేస్తే అరవింద్ కేజ్రీవాల్ - శరద్ పవార్ - ఫరూక్ అబ్దుల్లా - దేవెగౌడ వంటివారంతా వచ్చి మద్దతు పలికారు. ఫరూక్ అబ్దుల్లా అయితే ఏపీలో చంద్రబాబు తరఫున ప్రచారానికీ వచ్చారు.

కానీ.. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ విషయంలో మోదీ వేసిన స్టెప్‌ కు చంద్రబాబు మద్దతిచ్చారు. ఫరూక్ అబ్దుల్లా పాపం గొంతు చించుకుంటున్నా చంద్రబాబు ఆయన తరఫున మాట్లాడలేదు. ఆయన గృహ నిర్బంధాన్ని ప్రశ్నించలేదు. అంతేకాదు.. పార్లమెంటులోనూ మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లులకు మద్దతిస్తూ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ ఎంపీలు కూడా చంద్రబాబును కాపాడే ప్రయత్నాల్లోనే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. చంద్రబాబు ప్రయత్నాలు.. ఆయన అనుంగు బీజేపీ ఎంపీల ప్రయత్నాలు ఫలించి చంద్రబాబుపై నుంచి కేంద్రం ఫోకస్ తప్పిస్తుందో లేదో చూడాలి. లేదంటే.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లుగా చంద్రబాబుకు తమ తడాఖా ఏంటో చూపిస్తుందో చూడాలి.
 
Tags:    

Similar News