రోడ్డు మీద వెళుతున్నారా? ప్రతి నిమిషం డేంజరే

Update: 2015-09-06 04:26 GMT
ఇంట్లో నుంచి కాలు తీసి బయట పెడుతున్నారా? అయితే.. మీరు ప్రమాదంలో ఉన్నట్లే. అపాయం మీకు పొంచి ఉన్నట్లే. వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. వందశాతం నిజం. మనం తప్పులు చేయకున్నా.. ఎదుటోడి తప్పుల కారణంగా భారీగా నష్టపోయే పరిస్థితి ఈ రోజు నెలకొంది. తరచి చూస్తే.. చుట్టూ ఉండే సంఘటనలు చాలానే కనిపిస్తాయి.

రోడ్డు మీద వెళుతున్నప్పుడు యాక్సిడెంట్లు చూడటం.. అయ్యో అనుకుంటాం. కానీ.. కేంద్ర ప్రభుత్వ అధికారిక నివేదిక లెక్కలు చూస్తే నోట మాట రాని పరిస్థితి. మితిమీరిన వేగం.. పెరిగిన వాహనాల సంఖ్యతో పాటు.. వాహనాల్ని నడిపే వారిలో లోపించిన క్రమశిక్షణ.. నిబంధనల్ని తూచా తప్పుండా పాటించాలన్న వైఖరి లేకపోవటం.. ఎవరికి వారు వారి స్వార్థమే తప్పించి.. తమ కారణంగా ప్రమాదాలు జరుగుతాయన్న భయం భక్తి లేకపోవటంతో రహదారులు రక్తంతో తడిచిపోతున్నాయి.

దీనికి తోడు.. వేగంగా దూసుకెళ్లేలా తయారైన వాహనాలు మార్కెట్ లోకి వచ్చేయటం.. వేగవంతమైన జీవితంతో వాహనాల్ని.. గాల్లో తేలిపోయేలా నడిపేయటం ఈ మధ్య ఒక ఫ్యాషన్ గా మారింది. అదేమంటే.. హైదరాబాద్ నుంచి నాలుగు గంటల్లో వెళ్లిపోయా అంటే.. అరే నీకంత టైం పట్టిందా? నాకు మూడున్నర గంటలే పట్టిందే అన్న మాటలు మరింత వేగంగా వాహనాల్ని నడిపే పరిస్థితి.

ఇలాంటి సిల్లీగా అనిపించినా.. తరచి చూస్తే.. ఇలాంటి గొప్పలు చెప్పుకోవటానికి ప్రయత్నించి.. అడ్డదిడ్డంగా వాహనాల్ని నడిపేసి ప్రమాదాలకు గురైన వారు చాలామందే ఉంటారు. తాజాగా 2014 ఏడాది గాను దేశ వ్యాప్తంగా రహదారుల ప్రమాదాలకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికను క్షుణ్ణంగా చూస్తే.. ప్రతి ఒక్కరూ ఎంత ప్రమాదంలో ఉన్నారన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. మార్పు మొత్తంగా కాకుండా.. మొదట మన నుంచి మొదలైతే సరి అన్న మాటను తూచా తప్పకుండా ఎవరికి వారు బాధ్యతగా వాహనాల్ని నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో ఏ మాత్రం తప్పు దొర్లినా చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుందని మర్చిపోకూడదు.

ఇక.. దేశవ్యాప్తంగా ప్రమాదాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందనటానికి ఒక్క చిన్న లెక్కలో చెప్పేయొచ్చు. దేశ వ్యాప్తంగా ప్రతి నిమిషం ఒక ప్రమాదం చోటు చేసుకుంటుదని లెక్కలు చెబుతున్నాయి. అంటే.. ఈ కొద్దిగా చదివిన స్వల్ప వ్యవధిలో కనీసం మూడు.. నాలుగు ప్రమాదాలు జరగి ఉంటాయన్న మాట. అంతేకాదు.. ప్రతి గంటకు 16 మంది కేవలం ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 125 కోట్ల జనాభా కారణంగా.. ప్రమాద తీవ్రత మన దగ్గరకు వచ్చేసరికి చాలా అరుదుగా ఉండొచ్చు కానీ.. దేశ వ్యాప్తంగా చూస్తే.. మన బతుకులు ఎంత డేంజర్ గా ఉన్నాయన్నది తాజా గణంకాలు స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఈ  గణాంకాలు మొత్తం కూడా పోలీస్ స్టేషన్లలో నమోదు అయినవి మాత్రమే. అవి కాకుండా చిల్లర.. మల్లరగా జరిగే వాటిని కూడా గుర్తుకు తెచ్చుకొని చదివితే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలోఇట్టే తెలుస్తుంది.

56  =  గంటకు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు (దేశ వ్యాప్తంగా)

16  = దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా గంటకు మృతి చెందుతున్న వారు

08  = దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం

10  = రోడ్డు ప్రమాదాల్లో దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర స్థానం

08  = రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారికి సంబంధించి ఏపీ స్థానం

10  =  రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థానం

3,89,974  =  2014 ఒక్క ఏడాదిలో లైసెన్స్ ఉన్న డ్రైవర్లు చేసిన యాక్సిడెంట్లు

40,488     =  లైసెన్స్ ఉన్న డ్రైవర్లు చేసిన యాక్సిడెంట్ల కారణంగా మరణించిన వారు

39,314      =  లైసెన్స్ లేని డ్రైవర్లు ఒక్క ఏడాదిలో చేసిన యాక్సిడెంట్లు

07,573     =  లైసెన్స్ లేని డ్రైవర్ల కారణంగా జరిగిన యాక్సిడెంట్లలో మరణించినవారు

92,411      =  దేశ వ్యాప్తంగా యాక్సిడెంట్లు ఎక్కువగా ‘‘టీ’’ జంక్షన్ల వద్దే జరిగాయి.

22,570     =  దేశ వ్యాప్తంగా అత్యధిక ప్రమాదాలు జరిగిన ముంబై మహా నగరంలో ఏడాదిలో చోటు చేసుకున్న యాక్సిడెంట్లు

01,671      =  దేశ వ్యాప్తంగా అతి తక్కువ ప్రమాదాలు జరిగిన మహా నగరంగా ఢిల్లీలో ఏడాదిలో జరిగిన యాక్సిడెంట్లు

84,436      = దేశ వ్యాప్తంగా ప్రమాదాలు జరిగిన సమయాల్లో మధ్యాహ్నం మూడు నుంచి ఆరు మధ్యలో జరిగిన ప్రమాదాలు

64,300      = దేశ వ్యాప్తంగా సాయంత్రం ఆరు నుంచి రాత్రి 9 మధ్యలో చోటు చేసుకున్న ప్రమాదాలు

39,982      = యాక్సిడెంట్లలో ఏడాది వ్యవధిలో మృతి చెందిన వారిలో 18 నుంచి 25 ఏళ్ల లోపు వారి సంఖ్య

51,235      =  యాక్సిడెంట్లలో ఏడాది వ్యవధిలో దేశ వ్యాప్తంగా మరణించిన వారిలో 26 నుంచి 45 ఏళ్ల లోపు వారి సంఖ్య
Tags:    

Similar News