హైద‌రాబాద్ అమ్మాయి..క‌డ‌ప అబ్బాయి..హోంశాఖ సంచ‌ల‌న నిర్ణ‌యం

Update: 2019-12-15 07:06 GMT
వ్యక్తిగత క్రమశిక్షణ సక్రమంగా లేకపోతే ఎంత ఉన్న‌త స్థానంలో ఉన్న‌వారైనా...అక్క‌డికి చేరుకునే వారైనా ఎలా పాథాళానికి ప‌డిపోతారో తెలియ‌జేసే ఉదాహ‌ర‌ణ ఇది. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అందుకున్న ఓ యువ ఐపీఎస్‌ సస్పెన్షన్‌ కు గురయ్యాడు. హైద‌రాబాద్ అమ్మాయి...క‌డ‌ప అబ్బాయి ప్రేమ‌లో ఏకంగా కేంద్ర హోంశాఖ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఆ యువ‌కుడి జీవితం అగమ్య‌గోచ‌రంగా మారింది.

క‌డ‌ప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండల పరిధిలోని పందిళ్లపల్లెకు చెందిన మహేశ్వర్‌ రెడ్డి సివిల్స్‌ పరీక్షల్లో 126వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌ గా ఎంపికయ్యారు. శిక్షణ కోసం హైదరాబాద్‌ లోని సర్దార్‌ వల్లబ్‌ భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమిలో చేరారు. అయితే, మహేశ్వర్‌ రెడ్డి ఓయూలో ఇంజినీరింగ్ చదివే సమయంలో కీసరకు చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో 8 ఏళ్ల‌ తర్వాత గతేడాది ఫిబ్రవరిలో సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. మహేశ్వర్‌ రెడ్డి ఐపీఎస్‌ కు ఎంపికైన తర్వాత తనకు విడాకులు ఇచ్చి కట్నం కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని యువతి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 27న యువతి ఫిర్యాదుతో హైదరాబాద్ జవహర్‌ నగర్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 498-ఏ - 323 - 506 - 3(1) - 3(ఆర్) - 3(ఎస్) - 3(2)(వి)(ఏ) ఆఫ్ ఎస్సీ - ఎస్టీ పీవోఏ యాక్ట్ కింద కేసులు నమోదుచేశారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న తనకు విడాకులిస్తానని మహేశ్వర్‌ రెడ్డి వేధిస్తున్నట్టు ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో కేంద్ర హోంశాఖ చర్య చేపట్టింది. దర్యాప్తు పూర్తయ్యేవరకు మహేశ్వర్‌ రెడ్డి ఆఫర్ ఆఫ్ అపాయింట్‌ మెంట్‌ ను రద్దుచేస్తున్నామని - తదుపరి ఉత్తర్వులు జారీచేసేవరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని కేంద్ర హోం శాఖ డైరెక్టర్ ఏకే సరన్ వెల్లడించారు. కేసు నుంచి విముక్తి పొందితే మళ్లీ ట్రైనీ ఐపీఎస్‌ గా అవకాశమిస్తామని తెలిపారు.
Tags:    

Similar News