జగన్ కోసం 'క్యూ' కడుతున్నారా?

Update: 2019-05-11 05:55 GMT
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందని పోలింగ్ ముందు నుంచినే అంటున్నారు. ప్రీ పోల్ సర్వేలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పట్టం గట్టాయి. జగన్ పార్టీ ఏపీలో భారీ స్థాయిలో సీట్లను నెగ్గే అవకాశం ఉందని వివిధ జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇరవైకి పైగా ఎంపీ సీట్లు రావొచ్చని కొన్ని నేషనల్ చానళ్లు అంచనా వేశాయి.

ఇక రాష్ట్ర స్థాయిలో కూడా అధ్యయనాలు అదే మాటే చెప్పాయి. అసెంబ్లీ సీట్ల విషయంలో, ఎంపీ సీట్ల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగు ఉండదని ప్రీ పోల్ అధ్యయనాలు అంచనా వేశాయి.

ఇక కేంద్రంలో పరిణామాల గురించి కూడా అందరికీ తెలిసిందే. కేంద్రంలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని.. ఎన్డీయే రూపంలో బీజేపీ అధికారానికి దగ్గరదగ్గరగా వచ్చి ఆగిపోతుందని వివిధ అధ్యయనాలు అంచనా వేశాయి.

ఇక కాంగ్రెస్ కు కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేవని, కాంగ్రెస్ కు వందకు మించి ఎంపీ సీట్లు వస్తే అదే ఎక్కువ..అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. మొదటి నుంచి ఇలాంటి అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ఇప్పుడూ అలాంటి విశ్లేషణలే సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రాంతీయ పార్టీలే ఢిల్లీ లో చక్రం తిప్పే అవకాశాలున్నాయని కూడా వివిధజాతీయ మీడియా వర్గాలు అంటున్నాయి.

అలా చక్రం తిప్పబోయే వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా ఒకరని ఆ విశ్లేషణల్లో పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ఇరవై వరకూ ఎంపీ సీట్లను సాధించుకుంటే.. ఆ పార్టీ మద్దతు ఢిల్లీలో కీలకం అవుతుందని ఆ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే జాతీయ పార్టీల వాళ్లు, ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్న వారు.. జగన్ తో సంప్రదింపులు మొదలు పెట్టినట్టుగా సమాచారం. జగన్ తో సమావేశానికి వస్తామంటూ కూడా కొన్ని పార్టీల వాళ్లు కబురు పంపుతున్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఫలితాలు వచ్చే వరకూ జగన్ ఏ అంశాన్నీ పట్టించుకునేలా లేరని.. వారందరికీ జగన్ ఓకే మాట చెబుతున్నారని..'పలితాలు వచ్చాకా.. మాట్లాడదాం..' అంటూ జగన్ నవ్వుతూ సమాధానం ఇస్తున్నారని తెలుస్తోంది!


Tags:    

Similar News