రూ.10వేల కోట్ల భవనం అగ్నికి ఆహుతి... నాడు - నేడు పిక్స్ వైరల్!
విలాసవంతమైన మాన్షన్ విలువ సుమారు 125 మిలియన్ డాలర్లు అని చెబుతున్నారు. అంటే.. భారత కరెన్సీలో అక్షరాలా 10,375 కోట్ల రూపాయలు.
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో కార్చిచ్చూ సృష్టిస్తున్న ఘోరాలు అన్నీ ఇన్నీ కాదని అంటున్నారు. ఈ విలయం దాటికి ఇప్పటికే సుమారు 10 మందికి పైగా మృతి చెందగా.. దాదాపు రూ.12 లక్షల కోట్ల ఆస్తి బుగ్గిపాలు అయినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో రూ.10 వేల కోట్లపైనే విలువైన ఓ మాన్షన్ బూడిదైన విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
అవును.. లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు ఎన్నో ఇళ్లను బుగ్గి చేసింది. వేల ఎకరాల ప్రాంతాన్ని బూడిద చేసిన పరిస్థితి. ఇక్కడ రగులుతున్న పొగ, మంటలు అంతరిక్షంలోని ఉపగ్రహాలకు స్పష్టంగా కనిపిస్తున్నాయంటే.. పరిస్థితి అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ క్రమంలో ఓ మాన్షన్ దగ్దమైన విషయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ఈ కార్చిచ్చు కారణంగా పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలో అత్యంత ఖరీదైన భవనాన్ని శిథిలంగా మార్చింది. ఆ విలాసవంతమైన మాన్షన్ విలువ సుమారు 125 మిలియన్ డాలర్లు అని చెబుతున్నారు. అంటే.. భారత కరెన్సీలో అక్షరాలా 10,375 కోట్ల రూపాయలు. ఈ సందర్భంగా ఆ మాన్షన్ కి సంబంధించి పలు కథనాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
ఈ భవనం లుమినార్ టెక్నాలజీస్ సీఈఓ ఆస్టిన్ రస్సెల్ ది కాగా.. ఇందులో 18 పడక గదులు ఉన్నాయని చెబుతున్నారు. ఈ భవనాన్ని అదెకు ఇస్తే నెలకు రూ. 3 కోట్ల పైనే వస్తోందని చెబుతున్నారు. నాడు అబ్బురపరిచిన ఫర్నిచర్, సుందరమైన గార్డెన్ అన్నీ కార్చిచ్చూ ధాటికి బూడిదగా మారిపోయాయి.
దీనికి సంబంధించిన చిత్రాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. నాడు - నేడు అంటూ సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన పాత పిక్స్, తాజా పిక్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్లు.