వినండ‌హో.. అమ‌రావ‌తిపై కేంద్ర మంత్రి క‌బుర్లు!!

Update: 2022-09-15 16:38 GMT

వినేవాడు వెంగ‌ళ‌ప్ప‌.. అయితే.. చెప్పేవాడు.. చిరంజీవి అవుతాడ‌ని.. సామెత ఉంది. ఇప్పుడు.. కేంద్ర మంత్రి నారాయ‌ణ స్వామి కూడా.. ఇలా చెప్పేశారు. వినేవాళ్లు ఉంటార‌ని.. వింటార‌ని.. పండ‌గ చేసుకుంటార‌ని.. ఆయ‌న భావించారో ఏమో.. తెలియ‌దు కానీ.. అమ‌రావ‌తి విష‌యంలో కేంద్రం ఎన‌లేని స‌హ‌కారం అందించింద‌ని.. ఆయ‌న ట‌ముకేసి మ‌రీ.. చెప్పేశారు. దీంతో బీజేపీ వారు పండ‌గ చేసుకోగా.. మిగిలిన జ‌నాలు మాత్రం చెవులు మూసుకున్నార‌ట‌.

స‌రే.. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే.. అమరావతి రాజధానిలో.. 40 నుంచి 80 శాతం పూర్తైన అభివృద్ధి పనులు ఆపడానికి వీల్లేదని నారాయ‌ణ స్వామి అన్నారు. ఓకే.. ఇది నిజ‌మే అనుకుంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలోని స‌చివులు.. ఏపీ స‌ర్కారుపై ఎందుకు వ‌త్తిడి తీసుకురాలేదు? అనేది దానికి ఆయ‌న దాట‌వేశారు. తాజాగా ఎన్టీఆర్‌ జిల్లా అభివృద్ధిపై అధికారులతో.. కేంద్రమంత్రి సమీక్ష నిర్వహించారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పేసి.. వినేవాళ్ల‌ను వెంగ‌ళ‌ప్ప‌లు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ వివాదాస్పద ప్రకటనల ఫలితంగానే అమరావతి ప్రాంతంలో అభివృద్ధి కొనసాగడం లేదని కేంద్ర మంత్రి  నారాయణస్వామి మ‌రో మాట అన్నారు. ఓకే.. ఇది నిజ‌మే అనుకుందాం.. మ‌రి మూడేళ్ల‌పాటు.. కేంద్రంలోని బీజేపీ పాల‌కుల‌కు, నాయ‌కుల‌కు ఈ విష‌యం తెలియ‌దా?  మూడు రాజ‌ధానులు అన్న‌ప్పుడు.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా పార్ల‌మెంటులో.. వ్య‌వ‌హ‌రించింది.. తమ పార్టీ మంత్రులు కాదా? అంటున్నారు నెటిజ‌న్లు.

 ఒక ప్రభుత్వం చేసింది కాబట్టి.. మరో ప్రభుత్వం చేయకూడదనే మనస్తత్వం రాజకీయ పార్టీ నేతలకు ఉండకూడదని హితవు పలికారు. ఈ విష‌యాన్ని రైతులు స‌హా.. మేధావులునెత్తీనోరూ.. కొట్టుకుని చెప్పిన‌ప్పుడు.. బీజేపీ రాష్ట్ర నేత‌లు కానీ.. కేంద్ర పాల‌కులుల కానీ.. ఎందుకు స్పందించ‌లేదు?  కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా భావించే.. పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఆ పెద్ద మొత్తం ఎంతో కూడా చెప్పేసి ఉంటే.. బాగుండేద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నిస్తోందని మంత్రి చెప్పారు. ఆ ప్ర‌య‌త్నం.. 8 ఏళ్ల‌కా?  జ‌రిగేది...? అనేది ప్ర‌శ్న‌.  ఏదేమైనా.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నం త‌ప్ప‌.. మ‌రొక‌టి లేని.. కేంద్ర పాల‌కుల‌కు.. ఇప్ప‌టికిప్పుడు.. ప్రేమ పుట్ట‌డం మంచిదే అయినా.. ఎన్నాళ్లు ఈ ప్రేమ చూపిస్తారో.. చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News