అఫిషియ‌ల్ః తలాఖ్‌...ఇక ప్యాక‌ప్‌

Update: 2017-02-06 07:04 GMT
ముస్లిం మహిళ‌లు సుదీర్ఘ‌కాలంగా నిర‌సిస్తున్న ట్రిపుల్ తలాఖ్‌ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. కేంద్ర న్యాయ‌శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ట్రిపుల్ తలాఖ్‌ ను నిషేధిస్తూ కేంద్రం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ట్రిపుల్ త‌లాఖ్‌ సంప్రదాయం వల్ల మహిళలకు గౌరవం లభించడం లేదని, అందువల్ల దీన్ని నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కోడ్ ఉన్నందున సాధ్యం కాద‌ని యూపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రవిశంకర్ ప్రసాద్ వివ‌రించారు.

ఈ సామాజిక దురాచారాన్ని అంతమొందించడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన చెప్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మూడు అంశాలపై ఈ సమస్యను లేవనెత్తుతుందని రవిశంక‌ర్ ప్ర‌సాద్ చెప్పారు. ఈ సమస్య మతానికి సంబంధించినది కాదని, మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించినదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం మత విశ్వాసాలను గౌరవిస్తుందని, అయితే భక్తి, సాంఘిక దురాచారం కలిసి ఉండవన్నారు.  మహిళలను గౌరవించేది తమ పార్టీ ఒక్కటేనని చెప్పిన ఆయన మిగతా పార్టీలు మహిళలకు సముచిత స్థానం ఇవ్వకపోవడమే కాదు, వారిని కనీసం గౌరవంగా చూడవని అన్నారు. బీఎస్పీపై ధ్వజమెత్తిన మంత్రి రవిశంక‌ర్ ప్ర‌సాద్‌ ఆ పార్టీ కుల రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, మహిళలను గౌరవించాలని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News