ఏపీ రాజ‌ధానిగా విశాఖ‌: కేంద్రం ఇచ్చిన డాక్యుమెంట్‌లో వెల్ల‌డి..!

Update: 2021-08-29 12:30 GMT
న‌వ్యాంధ్ర తొలిపాల‌నా.. ప్ర‌భుత్వం చంద్ర‌బాబు హ‌యాంలో ఏర్పాటు చేసిన అమ‌రావ‌తి రాజ‌ధానిపై జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ముందు అమ‌రావ‌తికి జై కొట్టిన జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చాక టంగ్ మార్చేశారు. మూడు రాజ‌ధానులు అంటూ.. రాగం అందుకు న్నారు. అయితే.. రాజ‌ధానిగా అమ‌రావ‌తే ఉండాలంటూ.. దాదాపు 700 రోజులుగా అమ‌రావ‌తి ప్ర‌జ‌లు ఉద్య‌మాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, మూడు రాజ‌ధానుల విష‌యంపై కేంద్రం వ‌ద్ద కూడా సంవాదాలు న‌డిచాయి.

అయితే.. ఎటూ తేల్చ‌ని కేంద్రం.. అప్పుడ‌ప్పుడు మాత్రం జ‌ర్క్‌లు ఇస్తోంది. ఇటీవ‌ల ఇచ్చిన ఓ ప్ర‌క‌ట‌న లో మూడు రాజ‌ధానులు అని పేర్కొంది. అయితే, దీనిపై వివాదం రేగ‌డంతో వెనక్కి త‌గ్గి.. రాజ‌ధాని అని పేర్కొంది. ఇక‌, ఇప్పుడు ఇలాంటి వివాద‌మే మ‌రొక‌టి కేంద్రం నుంచి శ‌త‌ఘ్ని రూపంలో దూసుకువ చ్చింది. ప్ర‌స్తుతం ఈ ప‌రిణామం.. రాజ‌ధాని వాసుల‌ను తీవ్ర‌స్థాయిలో క‌ల‌చి వేస్తుండ‌గా.. అమ‌రావ‌తి ప్రియుల‌ను, రాజ‌ధాని అమ‌రావ‌తిగా ఉండేవారిని మ‌రింత బాధ‌కు గురిచేసింది.

విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్రంలో జ‌గన్ అధికారంలోకి వచ్చాక.. మూడు రాజధానుల కాన్సెప్ట్‌ తెరపైకి తెచ్చింది. అమ‌రావ‌తి కేవ‌లం ఒకే సామాజిక వ‌ర్గానికి ప్ర‌తిపాదించ‌బ‌డిన న‌గ‌ర‌మ‌ని.. పేర్కొంటూ..  అధికార వికేంద్రీకరణ పేరుతో మూడుకు శ్రీకారం చుట్టారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఈ దిశగా అడుగులు కూడా పడ్డాయి. అయితే.. న్యాయపరమైన చిక్కులు ఎదురవడంతో.. వాటిని క్లియర్‌ చేసుకునే పని కొనసాగుతోంది.

ఇక‌, ఈ ప‌రిణామంతో అమ‌రావ‌తి కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్య‌మ బాట‌ప‌ట్టారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ రాజ‌ధానిగా అమ‌రావ‌తే కొన‌సాగాల‌నేది వీరి డిమాండ్‌. అయితే.. ప్ర‌భుత్వం మాత్రం ఎట్టి ప‌రిస్థితిలోనూ మూడుకే మొగ్గు అని చెబుతోంది. తాజాగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా ఇదే విష‌యంపై మాట‌ల మంట‌లు రేప‌డంతో రాజ‌ధాని రైతులు ల‌బోదిబో మంటూ.. ఆయ‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఏపీ రాజధాని అంశానికి సంబంధించి తాజాగా కొత్త అలజడి రేగింది. ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలాగున్నాయంటూ పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం అండ్ గ్యాస్ మంత్రిత్వశాఖ రాతపూర్వక వివరణ ఇచ్చింది.


కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ఇచ్చిన వివరణలో ఏపీ రాజధానిగా `వైజాగ్` ను పేర్కొంది. కేంద్ర పెట్రోలియం అండ్ గ్యాస్ మంత్రిత్వశాఖ పేరుతో విడుదలైన ఈ డాక్యుమెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కేపిటిల్ గా వైజాగ్ ను చూపడంతో కేంద్రం అధికారికంగా గుర్తించిందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ డాక్యుమెంట్ పై వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ స్పందిస్తూ.. ఏపీ రాజధాని వైజాగేనన్న దానిపై మాకు గాని, మా ప్రభుత్వానికి గాని, ప్రజలకు గాని ఎలాంటి అనుమానం లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు.

మొత్తానికి ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. న‌నిన్న‌టికి నిన్న‌.. బొత్స‌.. రాజ‌ధాని రైతుల‌తో సంప్ర‌దించేది చ‌ర్చించేదీ లేద‌ని చెప్ప‌డం.. తెల్లారేస‌రికి కేంద్రం వైజాగ్‌ను రాజ‌ధానిగా పేర్కొన‌డం.. మ‌రి ఇది అనుకుని జ‌రిగిందా?  అనుకోకుండానే జ‌రిగిందా?  తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే!
Tags:    

Similar News