బాబు కమిటీలో ఉండే సీఎంలు ఫిక్స్

Update: 2016-11-28 09:51 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్త గుర్తింపు లభించినట్లే. గతంలో నీతి అయోగ్ లో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబు సత్తా ఏమిటో ప్రధాని మోడీతో సహా కేంద్రానికి బాగానేతెలుసు. పెద్దనోట్ల రద్దు తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులను సమీక్షించటం.. నగదు రహిత విధానాల్ని ప్రోత్సహించేందుకు వీలుగా ఏర్పాటు చేయాల్సిన విధానం కోసం కేంద్రం ఐదుగురు ముఖ్యమంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీ వేయటం తెలిసిందే.

ఈ కమిటీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యం వహించనున్నారు. ఇక.. ఈ కమిటీలో సభ్యులుగా ఉండే నలుగురు ముఖ్యమంత్రుల్ని కేంద్రం నిర్ణయించింది. వీరిలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (జేడీయూ).. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (బీజేపీ).. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి (కాంగ్రెస్).. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కారు (కమ్యూనిస్ట్ పార్టీ) ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరందరికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (తెలుగుదేశం పార్టీ) కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు.. రానున్న రోజుల్లో నగదు రహిత కార్యకలాపాలు జరిపేందుకు వీలుగా ఏమేం చేయాలి? ఎలాంటి చర్యల దిశగా కేంద్రం ప్రయత్నించాలన్న నివేదికను కమిటీ సభ్యులు తయారు చేసి కేంద్రానికి సమర్పిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పెద్ద నోట్ల రద్దుపై మేధావులు.. మాజీ ఆర్ బీఐ గవర్నర్లతో భేటీ అయి మరీ.. ఒక నివేదికను తయారు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాజా సబ్ కమిటీలో చోటు దొరక్కపోవటం గమనార్హం.
Tags:    

Similar News