సీపీఐ మాట‌!...కేసీఆర్ కు సంకెళ్లు త‌ప్ప‌వు!

Update: 2017-10-29 17:12 GMT
తెలంగాణ సీపీఐ సీనియ‌ర్ నేత చాడ వెంక‌టరెడ్డి సీఎం కేసీఆర్‌ పై తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోయారు. కేసీఆర్ ప్ర‌జావ్య‌తిరేక విధానాలు అవ‌లంబిస్తున్నార‌ని - ఆరుగాలం శ్ర‌మించి - త‌మ ఉత్ప‌త్తుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌ను డిమాండ్ చేస్తున్న రైతుల‌కు న‌డిరోడ్డుపై సంకెళ్లు వేసి న‌డిపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇదే విధానాల‌ను కేసీఆర్ కొన‌సాగిస్తే.. రాబోయే రోజుల్లో అవే సంకెళ్లు కేసీఆర్‌కు ప‌డ‌తాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం తెలంగాణ సీపీఐ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ``సామాజిక తెలంగాణ- సమగ్రాభివృద్ది లక్ష్యం`` పోరుబాట కార్య‌క్ర‌మం ఖమ్మం జిల్లాలో జ‌రుగుతోంది. ఈ పోరుబాట కల్లూరు చేరుకున్న సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడారు.  తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ అందుబాటులో లేకుండా పోయిందని - ఫ‌లితంగా పేద‌ల‌కు వైద్యం అంద‌ని ద్రాక్ష‌మాదిరిగా మారింద‌ని పిట్ట‌లు రాలిన‌ట్టు అనారోగ్యంతో ఉన్న పేద‌లు రాలిపోతున్నార‌ని అన్నారు.

బంగారు తెలంగాణ‌ను తెస్తాన‌న్న కేసీఆర్  ప్రభుత్వం అన్నదాతకు సంకెళ్ళు వేసిందని దుయ్య‌బ‌ట్టారు. ``కేసీఆర్‌ కబడ్దార్‌.. నీకు సంకెళ్ళు వేసే రోజులు ముందున్నాయి`` అని తీవ్ర‌స్థాయిలో హెచ్చరించారు. కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతున్నాయని - చేతలు మాత్రం గడప దాటని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల నోట్లో మన్ను కొడుతూ ప్రజా పంపిణి కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని పార్టీలను కలుపుకుని టీఆర్‌ ఎస్‌ ను ఎండగడతామని చాడ హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం కాకుండా కుటుంబం కోసం ప‌నిచేస్తున్న‌ట్టు ఉంద‌ని ఎద్దేవా చేశారు. ఏ ఒక్క ప‌థ‌క‌మూ పేద‌ల‌కు చేర‌డం లేద‌ని, మంత్రులు, టీఆర్ ఎస్ నేత‌లు ప్ర‌జా ధ‌నాన్ని దోపిడీ చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. కాగా, చాడ పోరుబాట‌కు ప‌లువురు సంఘీభావం ప్ర‌క‌టించారు.

 సీపీఐ పోరుబాట వైరా నుంచి బయలుదేరి తల్లాడ - కల్లూరు - పెనుబల్లి మీదుగా సత్తుపల్లికి చేరుకుంది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంఘీభావం తెలిపి తన కార్యకర్తలతో కలిసి పోరుబాటలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ - టీడీపీ - సీపీఎం - అఖిలపక్ష పార్టీ శ్రేణులు - ఎమ్మార్పీఎస్‌ లు కూడా సంఘీభావం తెలిపాయి. సత్తుపల్లికి చేరిన ‘పోరుబాట’కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఏకపక్ష, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందంటూ ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ సీపీఐ పోరుబాటను కొనసాగిస్తోంది. దీనికి ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌ని కామ్రెడ్లు చెబుతున్నారు. మ‌రి కేసీఆర్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News