భోజనం లేదు.. లగేజ్ అందలేదు.. విమానంలో క్రికెటర్లకు చేదు అనుభవం

Update: 2022-12-03 23:30 GMT
క్రికెటర్లు -విమాన ప్రయాణాలు విడదీయరాని అనుభూతుల సంగమం. క్రికెటర్లు అత్యంత భద్రత మధ్య ప్రయాణాలు సాగిస్తుంటారు. పాకిస్థాన్ లాంటి దేశానికి వెళ్లినప్పుడు 2009లో శ్రీలంక జట్టుపై జరిగిన ఉగ్ర దాడి అందరికీ గుర్తుండే ఉంటుంది. శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్పటినుంచి క్రికెటర్ల ప్రయాణం మరింత కట్టుదిట్టం చేశారు. ఇక కొవిడ్ వచ్చాక విమాన ప్రయాణాల్లో మూడేళ్లుగా అనేక పరిమితులు.

మరోవైపు విమాన ప్రయాణంలో క్రికెటర్ల మధ్య జరిగే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి. సహచరులను ఆట పట్టించడం.. పాటలు పాడడం.. తుంటరిగా ఇంటర్వ్యూలు చేయడం ఇలాంటి వీడియోలు చాలా బయటకు వచ్చాయి. కాగా, విమాన ప్రయాణంలో టీమిండియా క్రికెటర్లకు వింత అనుభవం ఎదురైంది. దీంతో పేసర్ దీపక్ చాహర్ తన అయిష్టతను వ్యక్తం చేశాడు.

మలేసియిన్ ఎయిర్ లైన్స్ ఇదేం తీరు..?

మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ఇందుకోసం జట్టు సభ్యులు ప్రయాణమయ్యారు. దీపక్ చాహర్ కూడా మలేసియన్ ఎయిర్ లైన్స్ లో బయల్దేరాడు. అయితే తనకు ఈ ఎయిర్‌లైన్స్‌ విమానంలో దారుణమైన పరిస్థితి ఎదురైందని వివరించారు. ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ ఆ సంస్థపై మండిపడ్డాడు. మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌లో భారత క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో దారుణమైన అనుభవాన్ని చవి చూశామని ఈ మేరకు బౌలర్‌ దీపక్‌ చాహర్‌ ట్వీట్‌ చేశాడు. తమ లగేజీని ఇంకా ఇవ్వలేదని..  బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించిన తమకు ఎలాంటి ఆహారం కూడా అందించలేదని అతడు ఆరోపించాడు.

న్యూజిలాండ్ నుంచి నేరుగా వస్తూ

ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ పర్యటనలో దీపక్ చాహర్ టి20 సిరీస్ ఆడాడు. చివరి రెండు మ్యాచ్ ల్లో అతడు మైదానంలోకి దిగాడు. ఆ సిరీస్ లో పాల్గొన్న దీపక్ చాహర్, హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్‌, శార్దుల్‌ ఠాకూర్‌, ధావన్‌, గిల్‌, సుందర్‌ న్యూజిలాండ్‌ నుంచి ఢాకాకు మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో వచ్చారు. బంగ్లాదేశ్ తో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌ కోసం టీమ్‌ ఇండియా జట్టుతో కలిశారు. అయితే ఈ ప్రయాణంలో తాము ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు చాహర్‌ తెలిపాడు.

‘మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌లో దారుణమైన అనుభవం ఇది. మొదట ఎలాంటి సమాచారం లేకుండా మా విమానాన్ని మార్చారు. బిజినెస్‌ క్లాస్‌లో మాకు ఆహారం అందించలేదు. ఇక మేం మా లగేజ్‌ కోసం 24 గంటలుగా వేచి చూస్తున్నాం. రేపు మాకు మ్యాచ్‌ ఉంది. మా పరిస్థితిని ఊహించుకోండి’ అంటూ చాహర్‌ శనివారం ట్రైనింగ్‌ సెషన్‌కు ముందు ట్వీట్‌ చేశాడు. దీనిపై మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌ కంప్లైంట్‌ లింక్‌ పంపించగా.. అది ఓపెన్‌ కావడం లేదని చాహర్‌ పేర్కొన్నాడు. ఆ తర్వాత ఫ్లైట్‌ ఛేంజ్‌కు సంబంధించి విమానయాన సంస్థ బదులిచ్చింది. ‘అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాం. వాతావరణ, సాంకేతిక కారణాల వల్ల అలా జరిగింది’ అంటూ పేర్కొంది. ఆదివారం నుంచి భారత్‌,బంగ్లాదేశ్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News