నారాయ‌ణ‌.. చైత‌న్య‌ల్లో మార్పు వ‌చ్చేసింద‌ట‌

Update: 2017-10-30 09:23 GMT
ఎవ‌రేం చెప్పినా లైట్ తీసుకునే కార్పొరేట్ విద్యాసంస్థ‌లు మారాయ‌ట‌. నిబంధ‌న‌ల్ని ప‌క్క‌న ప‌డేసి త‌మ సొంత రూల్స్ తో ఇష్టారాజ్యంగా చెల‌రేగిపోయే నారాయ‌ణ‌.. శ్రీ‌చైత‌న్య లాంటి విద్యాసంస్థ‌ల్లో ఇప్పుడు మార్పు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంద‌ని చెబుతున్నారు. వారంలో ఆరు రోజులు మాత్ర‌మే ఇంట‌ర్ కాలేజీలు ఉండాల్సి ఉన్నా..ఆదివారం స్పెష‌ల్ క్లాస్ ల పేరుతో పాటు.. తెల్ల‌వారుజామున మొద‌ల‌య్యే రుద్దుడు కార్య‌క్ర‌మం రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కూ కొన‌సాగేది.

పిల్ల‌ల్ని బ‌ట్టీ యంత్రాలుగా మార్చేసి.. ఫారాల్లో కోళ్ల మాదిరి పెంచేసేవారు. వారి చేత మార్కులు తెప్పించ‌ట‌మే ప‌నిగా పెట్టుకునేవారు. ఆరోగ్యం బాగోకున్నా.. ఇంట్లో ఏదైనా ముఖ్య‌మైన కార్య‌క్ర‌మం ఉన్నా.. అవేమీ అక్క‌ర్లేద‌ని తేల్చేసేవారు. కాదండి.. మా అబ్బాయి కాలేజీకి రాలేడ‌న్న మాట నోటి నుంచి వ‌చ్చిన క్ష‌ణం నుంచి పేరెంట్స్‌ కు వార్నింగ్ ఇచ్చేసేవారు.

ఒంట్లో బాగోలేద‌ని.. కాలేజీకి రాలేడ‌న్న మాట చెబితే.. మీ అబ్బాయిని మీ ద‌గ్గ‌రే ఉంచేసుకోండి.. మ‌ళ్లీ పంపాల్సిన అవ‌స‌రం లేదంటూ బెదిరింపుల‌కు దిగేవారు. దీంతో.. పిల్లల ఆరోగ్యం ఎలా ఉన్నా కాలేజీకి అబ్సెంట్ అయితే చాలు త‌ల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తే ప‌రిస్థితి. ఇక‌.. అవుటింగ్ రోజు కూడా పొద్దున నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ చ‌దివించిన త‌ర్వాత మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌దిలేవారు.

ఇలా పిల్ల‌ల‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ.. వారికి జీవితం మీద విర‌క్తి క‌లిగేలా చేస్తున్న నేప‌థ్యంలో కొన్ని సున్నిత మ‌న‌స్కులు తామీ ఒత్తిడిని భ‌రించ‌లేమంటూ సూసైడ్లు చేసుకునే దుస్థితి.ఈ నేప‌థ్యంలో కార్పొరేట్ కాలేజీల దుర్మార్గంపై వ‌రుస క‌థ‌నాలు మీడియాలో రావ‌టం.. విద్యావేత్త‌లు.. ప్ర‌ముఖులు.. విరుచుకుప‌డ‌టంతో పాటు.. విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి సైతం వ్య‌తిరేక‌త మొద‌లైంది.

దీంతో.. మొండిత‌నంతో వ్య‌వ‌హ‌రించే కార్పొరేట్‌ కాలేజీల తీరు మారింది. పిల్ల‌ల చ‌ద‌వులు  విష‌యంలో గ‌తంలో మాదిరి క‌ఠినంగా కాకుండా కాస్త మార్పు వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. యంత్రాల మాదిరి తెల్ల‌వారుజాము మొద‌లు రాత్రివ‌ర‌కూ చ‌దివిస్తున్న వైనానికి కాస్త బ్రేక్ ఇవ్వ‌ట‌మేకాదు.. అనారోగ్యం అయితే మందులేసి మ‌రీ చ‌దివించే తీరుకు బ్రేకులు వేసిన‌ట్లు చెబుతున్నారు. గ‌తంలో మాదిరి పేరెంట్స్ ప‌ట్ల ప‌రుషంగా వ్య‌వ‌హ‌రించే కాలేజీ సిబ్బంది ఇప్పుడు మ‌ర్యాద‌గా మాట్లాడ‌ట‌మే కాదు.. విద్యార్థుల్ని మార్కుల యంత్రాల మాదిరి కాకుండా మ‌నుషులుగా చూస్తున్నార‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News