చలో ట్యాంక్ బండ్.. పంతం నెగ్గించుకున్న కార్మికులు

Update: 2019-11-09 10:25 GMT
తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఆందోళనల్లో భాగంగా ఆర్టీసీ జేఏసీ, విపక్షాలు, ప్రజాసంఘాలు ఈరోజు ఇచ్చిన 'చలో ట్యాంక్ బండ్' పిలుపు హైదరాబాద్ లో ఉద్రిక్తంగా మారింది. శనివారం వందలాది మంది నిరసన కారులు ట్యాంక్ బండ్ పైకి వివిధ మార్గాల్లో దూసుకు రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  బారికేడ్లు, కంచెలు దూకి పోలీస్ వలయాన్ని చేధించు కొని ట్యాంక్ బండ్ పైకి చేరుకున్నారు. పోలీసులు చాలా మందిని అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ క్రమం లోనే పోలీసులకు, నిరసన కారులకు మధ్య తోపులాట ఘర్షణ చోటు చేసుకుంది.

*ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అరెస్ట్
ట్యాంక్ బండ్ పైకి నిరసన కారులతో వస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావును పోలీసులు హిమాయత్ నగర్ వద్ద అరెస్ట్ చేశారు. బైక్ పై వస్తున్న సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ ను కూడా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

*రాళ్లు రువ్విన కార్మికులు.. పోలీసుల లాఠీ చార్జి
ట్యాంక్ బండ్ పై పోలీసులు మోహరించడం తో చాలా మంది నిరసన కారులు లోయర్ ట్యాంక్ బండ్, ఇందిరా పార్క్ ధర్నా దీక్ష కు వద్దకు దూసుకెళ్లి ఆందోళన చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రం గా ప్రయత్నించారు. ఈ సందర్భంగా లాఠీచార్జీ చేశారు. పోలీసులపై ఆర్టీసీ కార్మికులు రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తం గా మారడం తో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.  ట్యాంక్ బండ్, సచివాలయం, లిబర్టీ వద్ద కూడా ఆర్టీసీ కార్మికుల పై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇందులో పలువురు కార్మికులకు గాయలయ్యాయి.

*ఎంపీ బండి సంజయ్ అరెస్ట్..
కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సెక్రెటేరియట్ వైపు నుంచి ఆర్టీసీ కార్మికుల తో ట్యాంక్ బండ్ పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకొని ఎంపీని,ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేశారు. తోపులాటతో లాఠీచార్జి కూడా చేశారు.

* విమలక్క, తమ్మినేని, జూలకంటి అదుపు లోకి..
ఇక మరోవైపు ఎంపీ భవన్ నుంచి ట్యాంక్ బండ్ పైకి ర్యాలీగా కమ్యూనిస్ట్ నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి,  విమలక్కలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ర్యాలీగా ట్యాంక్ బండ్ పైకి వస్తుండగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.

*పోలీసుల కళ్లు గప్పి ట్యాంక్ బండ్ పైకి
అయితే ఎంత కట్టు దిట్టమైన బందోబస్తు చేసినా కొందరు నిరసన కారులు పోలీసుల కళ్లుగప్పి ట్యాంక్ బండ్ పైకి చేరుకున్నారు. అక్కడ బైటాయించి కేసీఆర్ సర్కారు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

* తెలంగాణ వ్యాప్తంగా అరెస్ట్ లు
హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో కూడా అరెస్ట్ లు కొనసాగాయి.ఆయా జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆర్టీసీ కార్మికులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డిని, వనపర్తి లో చిన్నారెడ్డి ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ అక్రమ అరెస్ట్ లు చేయించడంపై నేతలు మండిపడ్డారు.
Tags:    

Similar News