చంచల్ గూడ.. ఇక చరిత్రేనా?

Update: 2021-08-30 16:30 GMT
స్వాతంత్య్ర పోరాటం.. సాయుధ పోరాటం.. మావోయిస్టుల అలజడి.. మనీ కుంభకోణం జరిగిన నాళ్లల్లో చంచల్ గూడ జైలు పేరు మారుమోగేది.  ఈ సమయంలో శిక్షలు పడ్డవారిని ఎక్కువగా చంచల్ గూడ జైలుకే తరలించేవారు. ఇప్పుడున్న ప్రముఖులు సైతం ఒకప్పుడు ఏళ్లతరబడి ఈ జైలులో జీవితాన్ని గడిపారు.  నిజాం కాలంలో నిర్మించిన ఈ జైలు ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతుందా..? దీనిని కూల్చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందా..? ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి చూస్తే చంచల్ గూడ జైలును మరికొద్దిరోజుల్లో మనం చూడలేమనిపిస్తోంది. దీని చరిత్ర పుస్తకాల్లో మాత్రమే కనిపించనుంది. ఇంతకీ చంచల్ గూడ జైలుకున్న ప్రత్యేకత ఏమిటి..? దానిని ఎందుకు కూల్చివేయాలనుకుంటున్నారు..?

1876లో 6వ నిజాం కాలంలో చంచల్ గూడ జైలును నిర్మించారు. నవాబ్ ఖాన్ బహుదూర్ మీర్జా అనే శిల్పి ఈ జైలుకు నిజాం ఉల్ ముల్క్ అనే పేరు పెట్టి నిర్మించాడు. వెయ్యిమంది ఖైదీలున్న సామర్థ్యంతో ఉండే ఈ జైలు విస్తీర్ణం 49.32 ఎకరాలు. నాలుగు వాచ్ టవర్లతో పకడ్బందీగా పక్కాగా నిఘా ఉండే విధంగా నిర్మించారు. 2016లో దీనిని ఆధునీకరించారు. శిథిలావస్థకు చేరుతుందన్న క్రమంలో ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి సుందరంగా తయారు చేసింది. ఇందులో ఖైదీలకు శిక్షలు మాత్రమే కాకుండా వారిలో ప్రవర్తన తెచ్చే విధంగా విశాలంగా నిర్మించారు.

చంచల్ గూడ జైలులో కరుడుగట్టిన నేరస్థులను మాత్రమే తరలించేవారు. అయితే స్వాతంత్ర, సాయుధ పోరాట సమయంలో వ్యతిరేకంగా ఉన్నవారిని ఇందులో ఏళ్ల తరబడి ఉంచారు. ప్రస్తుతం గవర్నర్ బండారు దత్తాత్రేయ  గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ జైలును సందర్శించారు. ఎమర్జెన్సీ కాలంలో తాను ఏడాది పాటు జైలులు గడిపానని తెలిపాడు. ఇప్పుడు సీబీఐ, ఏసీబీ కేసుల్లో ఉన్నవారిని ఇక్కడికే తరలిస్తున్నారు. ప్రస్తుత ఏపీ సీఎం జగన్, విజయసాయిరెడ్డిలు ఇందులో 16 నెలలు రిమాండ్ గా  ఉన్నారు. బడా వ్యాపార వేత్తలు, మాజీ ఐఎఎస్ అధికారులు, మనీ లాండరింగ్ కేసులో ఉన్నవారంతా ఇక్కడికే తరలించారు.

2015లో మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి.  ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చర్లపల్లి, చంచల్ గూడ జైలును తరలించి రెసిడెన్సీ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు. నాటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, నేటి హోంమంత్రి మహమూద్ అలీ సైతం ప్రకటించారు. అయితే ఆచరణలో మాత్రం ముందుకు సాగలేదు. తాజాగా ఎంపీ ఓవైసీ అసదుద్దీన్ వరంగల్ మాదిరిగా చంచల్ గూడ జైలును తరలించి రెసిడెన్సీ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ ను కోరారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే చంచల్ గూడ జైలును కూల్చివేసే కార్యక్రమం జరగనుంది.

145 ఏళ్ల చరిత్ర కలిగిన చంచల్ గూడ జైలు తరలింపు సరికాదని కొందరు వాదిస్తున్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన కట్టడాలను కాపాడుకోవాలని అంటున్నారు. గతంలో కేసీఆర్ చంచల్ గూడ జైలును తరలిస్తామని చెప్పి ఆ తరువాత కొందరు సూచలను చేయడంతో మానుకున్నారన్నారు. కానీ ఇప్పుడు ఓ వైసీ కోరడంతో ఆ విషయాన్ని బయటకు తెస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకుంటే రాష్ట్రంలో చాలా ప్రాంతాలున్నాయని, వాటిలో విద్యాసంస్థలు, ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అంటున్నారు. అలాగే కూలేందుకు సిద్ధంగా ఉన్న ఎన్నో భవనాలను విడిచి చారిత్రక నేపథ్యం ఉన్న చంచల్ గూడ జైలు కూల్చేయడం మానుకోవాలంటున్నారు. అయితే ఈ విషయంపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News