మన బాల్యపు అద్భుత జ్ఞాపకం వెళ్లిపోయింది

Update: 2020-09-30 04:06 GMT
ఈ తరం పిల్లల దృష్టీ ఎంతసేపూ టీవీలు, ట్యాబ్‌లు, మొబైళ్లలో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం మీదే ఉంటోంది. కానీ ఒకప్పటి పిల్లల బాల్యం ఇలా ఉండేది కాదు. బయటికెళ్లి ఒళ్లు అలసిపోయేలా ఆటలు ఆడటం, ఇంట్లో ఉంటే నీతి కథలు చదవడం.. ఇదీ ఒకప్పటి చిన్నారుల బాల్యం సాగిన తీరు. అప్పట్లో పిల్లలకు ఇంటిపట్టున అతి పెద్ద వ్యాపకం అంటే చందమామ, బాలమిత్ర పుక్తకాల పఠనమే. అందులో రసవత్తరంగా సాగే జానపద కథలు అప్పటి పిల్లల్ని ఉర్రూతలూగించేవి. ఆ పుస్తకాల్ని చూస్తేనే ఒక ఉద్వేగం కలిగేది. మరో ప్రపంచంలోకి తీసుకెళ్లి విహరింపజేసేవి ఆ కథలు.

ఆ పుస్తకాల్లో కథలు ఎంత రసవత్తరంగా ఉండేవో అందులోని కథలు అంతే ఆకర్షణీయంగా ఉండేవి. ముఖ్యంగా ‘చందమామ’ పుస్తకంలోని బొమ్మల అందమే వేరుగా ఉండేది. ఒకప్పటి కాలంలో రాజంటే ఎలా ఉంటాడు.. భటుడంటే ఎలా ఉంటాడు.. యువరాణి అంటే ఎలా ఉంటుంది.. మాంత్రికుడంటే ఎలా ఉంటాడు.. ఇవన్నీ ఆ బొమ్మలు చూసే అర్థం చేసుకుని ఒక ఊహా ప్రపంచంలోకి వెళ్లేవాళ్లు అప్పటి పిల్లలు. వాళ్లను ఆ బొమ్మలతో దశాబ్దాల పాటు అలరించిన చిత్రకారుడు కె.సి.శివకుమార్. ఈ లెజెండరీ ఆర్టిస్ట్ చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 97 సంవత్సరాలు.

60 ఏళ్లకు పైగా శివకుమార్ చిత్ర కళతో అభిమానుల్ని అలరించారు. ఆయన ఎన్నో అద్భుతమైన బొమ్మలు గీసినప్పటికీ.. ‘చందమామ’తో వచ్చిన పేరు ప్రఖ్యాతులు, ఆదరణ వేరు. శివకుమార్ అసలు పేరు చాలామందికి తెలియదు. ‘అంబులి’ పేరుతో ‘చందమామ’లో బొమ్మలు గీసిన ఆయనకు ‘అంబులి మామ’గా పేరొచ్చింది. అప్పటి పిల్లలందరూ ఆయన్ని అలాగే పిలుచుకునేవాళ్లు. ఎంతో ప్రఖ్యాతి చెందిన, ఒక ట్రేడ్ మార్కు లాగా నిలిచిపోయిన ‘రాజు-బేతాళుడు’ బొమ్మ ఆయన గీసిందే.
Tags:    

Similar News