దీదీ దీక్ష‌లో!... బాబు ఊగిపోయారే!

Update: 2019-02-06 04:28 GMT
కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారుతో నాలుగేళ్ల పాటు క‌లిసిమెలిసి సాగిన టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా రాత్రికి రాత్రే యూట‌ర్న్ తీసుకున్నారు. అప్ప‌టిదాకా మోదీ తానా అంటే... తాను తందానా అంటూ సాగిన చంద్ర‌బాబు.. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందుగా మాట మార్చేశారు. అప్ప‌టిదాకా మిత్రుడైన మోదీ... ఇప్పుడు శ‌త్రువైపోయారు. ఈ నేప‌థ్యంలో మోదీని తిట్టిన ఏ నేత అయినా ఇప్పుడు చంద్ర‌బాబుకు స్నేహితుడిగానే క‌నిపిస్తున్నారు. మోదీకి వ్య‌తిరేకంగా ఎక్క‌డ దీక్ష‌లు, పోరాటాలు జ‌రిగితే... అక్క‌డికి బాబు రెక్క‌లు క‌ట్టుకుని వాలిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే మోదీ స‌ర్కారు పైకి త‌న‌కంటే కూడా స్పీడుగా దూసుకెళుతున్న తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ కూడా మిత్రురాలిగానే మారిపోయారు. ఇంకేముంది... మోదీకి వ్య‌తిరేంగా దీదీ త‌న‌దైన శైలి స్ట్రీట్ ఫైట్ కు తెర తీయ‌గానే... బాబు అక్క‌డ వాలిపోయారు.

శార‌దా చిట్ ఫండ్ కేసులో ఎంత పిలుస్తున్నా వినిపించ‌ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్న కోల్ క‌తా పోలీస్ క‌మిష‌న‌ర్ ను విచారించేందుకు మొన్న సీబీఐ అధికారులు... రంగంలోకి దిగిపోయారు. ఊహించ‌ని ప‌రిణామంతో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డ మ‌మ‌త... సీబీఐ ఆఫీస‌ర్స్ ఎలా వ‌స్తారంటూ త‌న పోలీసు బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపిన సంగ‌తి తెలిసిందే క‌దా. ఈ క్ర‌మంలో అక్క‌డ ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకోగా.. మోదీ స‌ర్కారు నుంచి త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు దీదీ ఏకంగా రోడ్డెక్కారు. న‌డిరోడ్డు పైకి సీఎం హోదాలోనే వ‌చ్చేసిన దీదీ.. రెండు రోజుల పాటు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్ర‌మంలో అక్క‌డికి హడావిడిగా వెళితే... ఎక్క‌డ కొంప‌లు మునుగుతాయోన‌న్న బెంగ ఓ వైపు, ఇదే స‌రైన స‌మ‌యం అన్న భావ‌న మ‌రోవైపు... వెర‌సి కోల్ క‌తా వెళ‌దామా? వ‌ద్దా? అంటూ ఓ రోజంతా ఆలోచించి చివ‌ర‌కు కోల్ క‌తాకు బ‌య‌లుదేరేందుకే నిర్ణ‌యించుకున్నారు. అయినా దీదీ దీక్ష కొన‌సాగిస్తుండ‌గానే కోల్ క‌తాకు వెళ్లి ఏం చేయాలి?... ఈ సందేహం కూడా బాబుకు వ‌చ్చేసింది. తీరా దీక్ష విర‌మ‌ణ‌కు దీదీ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌న్న విష‌యం తెలుసుకుని స్పెష‌ల్ ఫ్టైటేసుకుని కోల్ క‌తాలో వాలిపోయిన చంద్ర‌బాబు... దీదీ దీక్ష‌ను తానే విర‌మించాన‌న్న రీతిలో క‌ల‌రింగ్ ఇచ్చా,రు.

అయినా దీక్ష‌ను విర‌మింప‌జేయాలంటే స‌ద‌రు దీక్షాద‌క్షుల డిమాండ్లు నెవ‌రేరాలి క‌దా. మ‌రి దీదీ డిమాండ్లేమీ లేకుండానే దీక్ష విర‌మించ‌క త‌ప్ప‌లేదు. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు బెంగాల్ స‌ర్కారుకు మొట్టికాయ‌లేసి, సీబీఐ విచార‌ణ‌కు రాజీవ్ హాజ‌రుకావాల్సిందేన‌ని తేల్చేసిన త‌ర్వాత‌... దీదీ దీక్ష విర‌మించ‌క త‌ప్ప‌లేదు. దీంతో దీదీ దీక్షా విర‌మ‌ణ‌ను వేదిక‌గా చేసుకున్న చంద్ర‌బాబు ఊగిపోయారు. మోదీ స‌ర్కారుపై త‌న‌దైన శైలిలో నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం దీదీని దెబ్బ తీయాల‌ని చూస్తోందంటూ ఊగిపోయిన చంద్ర‌బాబు... తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని వాపోయారు. కేంద్రంలో ఇలాంటి పార్టీని ఎప్పుడూ చూడలేదని కూడా త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు. ఎమర్జెన్సీ సమయంలోను ఇలా లేదని చెప్పిన చంద్ర‌బాబు... ఎమర్జెన్సీ కంటే దారుణంగా ప‌రిస్థితులు దాపురించాయ‌న్నారు.

ఈ సంద‌ర్భంగా అక్క‌డికి ఎవ‌రెవ‌రు వ‌చ్చార‌న్న విష‌యాన్ని ఓ సారి ప‌రిశీలించుకున్న చంద్ర‌బాబు... ఏపీ, బెంగాల్, ఢిల్లీ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. బీజేపీ అన్ని వ్యవస్థలను నాశనం చేస్తోందని శోకాలు పెట్టిన చంద్ర‌బాబు... శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిద‌ని చెప్పుకొచ్చారు. కొన్ని అంశాలే కేంద్రం పరిధిలో ఉంటాయని వ్యాఖ్యానించిన చంద్ర‌బాబు... రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని తన‌దైన శైలిలో నిప్పులు చెరిగారు. బ్యాంకులను దోచుకున్న వారిని దేశం నుంచి పంపించారని ధ్వజమెత్తారు. అమిత్ షా, ఆయన కొడుకు ఆస్తి 69 శాతం పెరిగిందన్నారు. బీజేపీ నేతలు తప్ప మిగతా వారంతా అవినీతిపరులా అని కూడా బాబు ప్రశ్నించారు. మొత్తంగా దీక్ష దీదీది అయితే... అక్క‌డ మోదీ స‌ర్కారుపై ఊగిపోయింది మాత్రం బాబేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News