పెద్దిరెడ్డి ప‌నైపోయింది.. చంద్ర‌బాబు ఫైర్‌.. పీలేరులోనూ కుప్పం సీన్‌!

Update: 2023-01-17 16:30 GMT
వైసీపీ ముఖ్య నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పైటీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ప‌ని అయిపోయిందని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడించి.. ఎక్క‌డికి పంపించాలో అక్క‌డికే పంపిస్తాన‌ని వ్యాఖ్యానించారు. తాజాగా పీలేరులో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. పెద్దిరెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లుగు ప్పించారు. ఏం తప్పులు చేశారని తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ప్రశ్నించారు.

అన్నమయ్య జిల్లా పీలేరు సబ్జైలులో ఉన్న పార్టీ కార్యకర్తలను చంద్ర‌బాబు పరామర్శించారు. అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా కొడతారా? అంటూ మండిపడ్డారు. తప్పు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తారా? అని నిలదీశారు. తమ పార్టీ కార్యకర్తలపై సీఐ, ఎస్సై చాలా దారుణంగా వ్యవహరించారని ఆగ్రహించారు. ఎంతమందిని జైల్లో పెడతారో తాము చూస్తామన్నారు.

మ‌రోవైపు.. పీలేరులోనూ గ‌తంలో కుప్పంలో చంద్ర‌బాబును అడ్డుకున్న‌ట్టుగానే ఇక్క‌డా అడ్డుకున్నారు. ఆయ‌న వాహ‌నాల‌ను రాకుండా అదుపు చేశారు. టీడీపీ నేత‌లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను చించేశారు. దీనిపై చంద్ర‌బాబు మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. "నన్ను పీలేరు రాకుండా అడ్డుకుంటారా?. నేనెక్కడికి వస్తే అక్కడ పోలీసు యాక్టు 30 పెడతారా?. ఎంతమందిని జైల్లో పెడతారో మేమూ చూస్తాం." అని హెచ్చ‌రించారు.

పోలీసులు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి పనైపోయిందని ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బాబు తెలిపారు. తమ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

ఇదిలావుంటే, పీలేరులో చంద్రబాబు పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. టీడీపీ నేత‌లు ఏర్పాటు చేసిన  సౌండ్‌ బాక్స్‌ల వాహనాన్ని సీజ్‌ చేశారు. చంద్రబాబు సౌండ్‌ వెహికిల్‌కు అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో ఆయ‌న సాధార‌ణ మైకులోనే మాట్లాడారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News