మోదీ కంటే అమిత్ షాని ఇంప్రెస్ చేయడానికే ఇష్ట పడుతున్నారు

Update: 2019-11-24 05:28 GMT
ఏపీ రాజకీయ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ కంటే హోం మంత్రి అమిత్ షా దృష్టి లో పడేందుకు, ఆయన్ను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదేదో ఏపీ బీజేపీ నాయకుల గురించి చెబుతున్నది కాదు. ఏపీలో అధికారం లో ఉన్న వైసీపీ, ప్రతిపక్షం లో ఉన్న టీడీపీ నాయకుల సంగతి ఇది. అవును... ఏ చిన్న సందర్భం వచ్చినా అమిత్ షాను పొగడడానికే ఇష్ట పడుతున్నారు. విమర్శలు చేసినప్పుడు మాత్రం బీజేపీ, మోదీలను లక్ష్యం చేసుకుంటున్నారు. అంతేకానీ, అమిత్ షాను మాత్రం పల్లెత్తు మాటనడానికి సాహసించడం లేదు సరికదా ఏమాత్రం చాన్సు దొరికినా ఆయన దృష్టిలో పడడానికే ప్రయత్నిస్తున్నారు.

జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రయిన తరువాత తొలిసారి దిల్లీ వచ్చినప్పుడే అమిత్ షా దేశం లో నంబర్ 2, ఆయన తలచుకుంటే పనవుతుంది కాబట్టి ఆయన్ను కలిసొచ్చానని చెప్పారు. ఆ తరువాత కూడా ఆయన అమిత్‌షా తో మంచి సంబంధాలకే ప్రయత్నిస్తున్నారు. ఏ విషయంలో కూడా అమిత్ షా మాటను కాదనేలా నడుచుకోవడం లేదని చెబుతున్నారు.

మరో వైపు టీడీపీ కూడా అమిత్ షాని తెగ అభిమానించేస్తోంది. బీజేపీ పై విమర్శలు చేయాల్సి వచ్చినా బీజేపీ పార్టీపై, ఇంకా అవసరమైతే ప్రధాని మోదీపై చేస్తున్నారు కానీ అమిత్ షా పేరు ఎక్కడా విమర్శల్లో ప్రస్తావించడం లేదు. తాజాగా చంద్రబాబు అయితే అమిత్ షాపై తెగ ప్రశంసలు కురిపించారు. అమరావతి పేరును సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌ లో చేర్చడం పై హర్షం వ్యక్తం చేసిన ఆయన దీని కోసం కృషి చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి కిషన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మొదటగా అమిత్ షాకు ‘ముందుగా ఇండియా మ్యాప్‌లో చేర్చకుండా ఉన్న అమరావతి పేరును చేర్చేందుకు హోం శాఖ తీసుకున్న చర్యలు భేష్. ఇందుకు కృతజ్ఞతలు. అమరావతిని మ్యాప్‌లో చేర్చి తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యారు.’ అని అన్నారు. అనంతరం తెలుగు బిడ్డ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కూడా థ్యాంక్స్ అని చెప్పారు. ‘అడిగిన వెంటనే ఆలస్యం చేయకుండా అమరావతి పై స్పందించి, చర్యలు తీసుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఙతలు. మీ ప్రయత్నం గుర్తించదగినది’ అని ట్వీట్ చేశారు.

టీడీపీ ఎంపీలు కానీ, ఇతర నాయకులు కానీ అమిత్ షా పై విమర్శలు చేయడం లేదు. ఏపీలోని పార్టీల నేతల తీరు చూస్తుంటే దేశానికి ఆయన భావి ప్రధాని అని ఫిక్సయిపోయినట్లే కనిపిస్తున్నారు. కాబట్టే ఇప్పటి నుంచే మంచిగా ఉందామనుకుంటున్నట్లుగా ఉన్నారు. అయితే, అమిత్ షాకు ఎదురెళ్తే కేసులు బయటకు తీస్తారన్న భయంతోనే ఆయన జోలికి వెళ్లడం లేదన్న వాదనాలూ వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News