చంద్రబాబు ఫైర్‌: మా నేత‌కు ఏమైనా అయితే.. మంత్రి అనిల్‌దే బాధ్య‌త‌..

Update: 2021-11-15 05:45 GMT
రాష్ట్రంలో పోలీస్ రాజ్ న‌డుస్తోంద‌ని.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిప్పు లు చెరిగారు. తాజాగా జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ నేత‌ల క‌నుస‌న్న‌ల్లో పోలీసులు.. టీడీపీ నేత‌ల‌ను క‌ట్టడి చేయ‌డం దారుణ‌మ‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. పురపాలక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతు న్న అధికార పార్టీ నేతలను వదిలి ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని వేధించటం దుర్మార్గమని  తీవ్ర‌స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో నోట్ల కట్టలు పంచుతూ పట్టుబడ్డ వైసీపీ నేతలను అదుపులోకి తీసుకోలేద‌ని మండిప‌డ్డారు.

వైసీపీ నాయ‌కుల దుర్మార్గాల‌ను, కోట్ల రూపాయ‌ల పంపిణీని ప్ర‌శ్నించిన తెలుగుదేశం నేతలను పోలీసు లు బెదిరించడం అనైతికం, అప్రజాస్వామికమని చంద్ర‌బాబు మండిపడ్డారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారిని అడ్డుకొని ప్రశ్నిస్తే.. టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు.. ప్ర‌స్తుతం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు రెడీ అయిన నెల్లూరులో అధికార పార్టీ ఆగ‌డాలు శృతి మించాయ‌ని.. చంద్ర‌బాబు విమ‌ర్శించారు.

నెల్లూరులో టీడీపీ అభ్యర్థులకు మద్దతిస్తున్న తమ పార్టీ నేత కప్పిర శ్రీనివాసులును మంత్రి అనిల్ ప్రోత్సాహంతో వారం రోజులుగా పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధించడం రాష్ట్రంలో పోలీస్ రాజ్ న‌డుస్తోంద‌ని చెప్ప‌డానికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా బాబు పేర్కొన్నారు. వైసీపీ  నాయకుల శాడిస్టు, సైకో మనస్థత్వానికి ఇది నిదర్శనమన్నారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక శ్రీనివాసులు ఆత్మహత్యకు యత్నించాడని ఆరోపించారు. శ్రీనివాసులుకు ఎటువంటి ప్రాణహాని జరిగినా మంత్రి అనిల్ కుమార్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

చట్టానికి విరుద్దంగా వ్యవహరించిన పోలీసులు న్యాయస్థానం ముందు తలొంచుకుని నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాదు.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయ్యేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. చంద్ర‌బాబు మండిప‌డ్డారు. ప్ర‌తి విష‌యాన్నీ.. తాము కోర్టు దృష్టికి తీసుకువెళ్తామ‌ని.. త‌మ‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు .. పోరాడ‌తామ‌ని.. ఈ విష‌యంలో పార్టీ శ్రేణుల‌కు ఎలాంటి అధైర్యం అవ‌స‌రం లేద‌ని కూడా చంద్ర‌బాబు స్పష్టం చేశారు.
Tags:    

Similar News